పెద్దనోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది? తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమైన పెద్దనోట్ల రద్దుపై సోమవారం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది. జస్టిస్ నజీర్, జస్టిస్ గవాయ్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇవ్వనుంది. 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన తర్వాత.. ఈ అంశంపై దాదాపు 58 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే పెద్దనోట్ల రద్దుపై పలుసార్లు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. రద్దుకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని కేంద్రంతోపాటు ఆర్బీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. అన్ని కోణాల్లో విచారించిన సుప్రీంకోర్టు సోమవారం తుది తీర్పును ఇవ్వాలని నిర్ణయించింది. పెద్దనోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోందంటూ..దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
ఐదుగురు జడ్జిల్లో ఎంతమంది సమర్థిస్తారు? ఎంతమంది వ్యతిరేకిస్తారు?
శీతాకాలం సెలవుల తర్వాత సుప్రీంకోర్టు కార్యకలాపాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ నజీర్ పదవీకాలం జనవరి 4తో ముగియనున్న నేపథ్యంలో ఈ తీర్పుకు ప్రాధాన్యత సంచరించుకుంది. అయితే ధర్మాసనంలోని ఐదుగురు సభ్యుల్లో ఎంత మంది సమర్థిస్తారు? ఎంతమంది వ్యతిరేకిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పెద్దనోట్ల రద్దుకు వ్యతిరకేంగా కాంగ్రెస్ సీనియర్ నేత, న్యాయవాది చిదంబరం తన వాదనలను బలంగా వినిపించారు. రూ. 500, రూ. 1,000 కరెన్సీ నోట్లను రద్దు చేయడం లోపభూయిష్టంగా ఉందని చిదంబరం వాదించారు.