Tamil Nadu: తమిళ రాజకీయాల్లో వీడని సస్పెన్స్.. ఎప్పుడు క్లారిటీ వస్తుందో?
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా ఉత్కంఠభరిత మలుపులు తిరుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే (తమిళగ వెట్రి కళగం) నిరంతరం ప్రయత్నాలు చేస్తుండగా, మధ్యలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. శుక్రవారం జరిగిన పరిణామాలు మరింత నాటకీయంగా మారాయి. సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన 4 ఎమ్మెల్యేల మద్దతు లేఖలను మధ్యాహ్నం టీవీకేకు అందజేశారు. ఆ తర్వాత సాయంత్రం ఐయూఎంఎల్ కూడా తమకు వచ్చిన 2 స్థానాల మద్దతు ఇస్తామని లేఖ పంపింది. మరోవైపు వీసీకే (విడుతలై చిరుతైగల్ కట్చి) శనివారం లేఖ ఇస్తామని ప్రకటించింది. ఈ పరిణామాల మధ్య టీవీకే అధినేత విజయ్, మ్యాజిక్ ఫిగర్ 118 ఎమ్మెల్యేల మద్దతు ఉందని పేర్కొంటూ గవర్నర్‌ను కలిశారు.
వివరాలు
మంత్రుల పదవులపై ఒత్తిడి
అయితే అనూహ్యంగా ఐయూఎంఎల్ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో టీవీకే సంఖ్యాబలం 116కు తగ్గిపోయింది. దీంతో గవర్నర్ నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. శనివారం వీసీకే మద్దతు లేఖ ఇచ్చిన తర్వాత మరోసారి విజయ్ గవర్నర్‌ను కలవనున్నారని సమాచారం. అధికారంలో భాగస్వామ్యంపై డిమాండ్లు పెరుగుతున్నాయి. టీవీకేకు మద్దతు ఇస్తున్న పార్టీల నుంచి మంత్రి పదవులపై ఒత్తిడి ఎక్కువవుతోంది. ఐదుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ రెండు మంత్రి పదవులు కోరగా, టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై దీనికి టీవీకే అంగీకరించిందని తెలిపారు. వీసీకే ఉపముఖ్యమంత్రి పదవి, ఒక మంత్రి పదవిని డిమాండ్ చేస్తోంది. దీనిపై టీవీకేలో చర్చలు కొనసాగుతున్నాయి. తిరుమావళవన్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్లు సమాచారం.
వివరాలు
టీవీకే సరిపడే బలం లేకపోతే అన్నాడీఎంకే అవకాశం ఇవ్వాలి
అలాగే విజయ్ గెలిచిన తిరుచ్చి ఈస్ట్ స్థానం ఖాళీ అవుతుండటంతో అక్కడ నుంచి తిరుమావళవన్‌ను పోటీకి దింపాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక టీవీకేకు మద్దతిచ్చినా తాము డీఎంకే కూటమిలోనే కొనసాగుతామని సీపీఎం, సీపీఐ స్పష్టం చేశాయి. మరోవైపు అన్నాడీఎంకే ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ గవర్నర్‌ను కలిసి టీవీకేకు సరిపడ బలం లేకపోతే అన్నాడీఎంకేకు అవకాశం ఇవ్వాలని కోరారు. తమ పార్టీ ఎమ్మెల్యేకు సంబంధించిన నకిలీ మద్దతు లేఖలు చక్కర్లు కొడుతున్నాయని కూడా ఆయన ఫిర్యాదు చేశారు. అన్నాడీఎంకే తరఫున పళనిసామిని సీఎంగా అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే గవర్నర్ స్పందన ఇంకా వెలువడలేదు.
వివరాలు
గవర్నర్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు
ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ తాము ప్రభుత్వ ఏర్పాటులో జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఎప్పుడు అన్నది ఇంకా స్పష్టత లేదు. శనివారం వీసీకే మద్దతు వస్తే విజయ్ ప్రమాణ స్వీకారం జరగవచ్చని భావించినా, గవర్నర్ నుంచి స్పందన రాకపోవడంతో ఆ ఆశలు నిలిచిపోయాయి. మరోవైపు కేరళలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వెళ్లనున్నారని సమాచారం. దీంతో తమిళనాడు రాజకీయ భవిష్యత్ మరింత అనిశ్చితిలో పడింది. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలించినట్లు సమాచారం. అదేసమయంలో డీఎంకే అధినేత స్టాలిన్ గవర్నర్‌ను వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.
వివరాలు
ప్రజల తీర్పును గౌరవించాలి
ప్రజల తీర్పును గౌరవించి పరిపాలన ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తమిళనాడులో కాంగ్రెస్, టీవీకే శ్రేణులు గవర్నర్ తీరుపై నిరసనలు చేపట్టాయి. చెన్నై సహా పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. టీవీకే కార్యాలయం వద్ద కూడా నిరసనలు, సంబరాలు రెండూ ఒకేసారి కనిపించాయి. ఇక అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిసామి తమ ఎమ్మెల్యేలను పుదుచ్చేరి రిసార్టుకు తరలించి వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించారు. అయితే పరిణామాలు మారిపోవడంతో ఎమ్మెల్యేలు చెన్నైకి తిరిగివచ్చారు. పళనిసామి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
వివరాలు
సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
ఇదే సమయంలో సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. గవర్నర్ జాప్యం కారణంగా విజయ్ ప్రభుత్వం ఏర్పాటు ఆలస్యమవుతోందని, దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది కె. ఎళిలరసి ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. అయితే టీవీకే పార్టీ ఈ పిటిషన్‌తో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. మొత్తంగా చూస్తే తమిళనాడు రాజకీయాలు తీవ్ర ఉత్కంఠలో ఉన్నాయి. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు దగ్గరగా వచ్చిందని అనిపించినప్పటికీ, మద్దతు లేఖలు, ఉపసంహరణలు, గవర్నర్ నిర్ణయాల కారణంగా పరిస్థితి ఇంకా సందిగ్ధంగానే కొనసాగుతోంది.