
Wife Kills Husband: భర్తను హత్య చేసిన భార్య.. సహకరించిన కుమార్తె!
ఈ వార్తాకథనం ఏంటి
అస్సాంలో తాజాగా వెలుగుచూసిన ఘోర ఘటన ఆందోళన కలిగిస్తోంది. పెళ్లి తర్వాత వేరే వారితో సంబంధాలు పెట్టుకుని భర్తలను హత్య చేస్తున్న సంఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అదే తరహాలో, అస్సాంలోని బోర్బరువా ప్రాంతంలో భార్య తన కుమార్తె సహా మరో ఇద్దరు యువకులతో కలిసి భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. తాము చేసిన ఘాతుకాన్ని దాచేందుకు, భర్త గుండెపోటుతో మరణించాడని భార్య బాబీ సోనోవాల్ గొగోయ్ కథ అల్లేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన జూలై 25న దిబ్రుగఢ్ జిల్లా జమీరాలోని లాహోన్ గావ్ ప్రాంతంలో జరిగింది. బాధితుడు ఉత్తమ్ గొగోయ్ తన ఇంట్లో మృతదేహంగా కన్పించాడు. మొదట అతని భార్య, కుమార్తె కలిసి గుండెపోటుతో మరణించాడని పోలీసులకు చెప్పారు.
Details
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
కానీ ఉత్తమ్ చెవిపై గాయాలు కనిపించడంతో అతడి సోదరుడికి అనుమానం కలిగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటివరకు స్ట్రోక్ మరణమని చెప్పిన బాబీ, ఆపై ఇంట్లో దొంగతనం జరిగిందని మరో కథ అల్లే ప్రయత్నం చేసింది. పోలీసులు విచారణ ప్రారంభించగా, నలుగురు కలిసి ప్లాన్ ప్రకారం ఉత్తమ్‌ను హత్య చేసిన విషయం బయటపడింది. అరెస్టైన నిందితుల్లో బాబీ, ఆమె 9వ తరగతి చదువుతున్న కుమార్తెతో పాటు, ఆమెతో సన్నిహిత సంబంధాలున్న ఇద్దరు యువకులు ఉన్నారు. దిబ్రుగఢ్ ఎస్ఎస్‌పీ రాకేష్ రెడ్డి ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన కూడా నిర్వహించారు. ఈ కేసు స్థానికంగా పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది.