Women Reservation Bill : చట్టంగా మారిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. రాష్ట్రపతి ఆమోద ముద్ర
కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందింది. ఇప్పటికే లోక్ సభ, రాజ్య సభల ఆమోదం పొందిన ఈ బిల్లును తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపి చట్టంగా మార్చారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఇవాళ ఈ బిల్లుపై సంతకం పెట్టారు. అనంతరం బిల్లు కాపీలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఆమె కూడా సంతకం పెట్టడంతో దశాబ్దాల తరబడి బిల్లుగానే పెండింగ్ లో ఉన్న మహిళ రిజర్వేషన్లు ప్రస్తుతం చట్టంగా మారాయి. 'నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సెప్టెంబర్ 19న లోక్ సభలో, సెప్టెంబర్ 21న రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
ఈ చట్టం ఇప్పుడే అమల్లోకి రాదు
అయితే ఈ చట్టం ఇప్పుడే అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. 2024 లోక్ సభ ఎన్నికల్లోనూ ఈ చట్టం అమల్లోకి రాదు. ఈ చట్టాన్ని అమల్లోకి తేవడానికి జనగణన నిర్వహించి, డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మొదటగా ఈ బిల్లును 1996లో హెచ్‌డీ దేవెగౌడ్ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలుత లోక్ సభలో ప్రవేశపెట్టింది. వాజ్ పేయి, మన్మోహన్ సింగ్ హయంలోనూ ఈ బిల్లు అమోదానికి నోచుకోలేదు. తాజాగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చింది.