Kavitha: ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలనే కుట్ర జరుగుతోంది: కవిత ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. హైదరాబాద్ మహానగరంలో కోటికి పైగా ప్రజలు నివసిస్తున్నారని, ఒకప్పుడు నగరంలో దాదాపు 7,500 ఆర్టీసీ బస్సులు తిరిగేవని గుర్తు చేశారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల సంఖ్యను సుమారు 3,500కు తగ్గించడంతో ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీని ప్రైవేటు చేతులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
Details
పారిశుద్ధ్య కార్మికుల కొరత
రవాణా వ్యవస్థ సక్రమంగా లేకపోతే హైదరాబాద్ ఎలా విశ్వనగరంగా మారుతుందని ఆమె ప్రశ్నించారు. అక్టోబర్ 25 నుంచి 'జాగృతి జనంబాట' కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని, ప్రతి జిల్లాలో రెండు రోజులు గడుపుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం 15 రోజుల పాటు పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో పర్యటించానని వెల్లడించారు. హైదరాబాద్‌లో వీధికుక్కల దాడులు ప్రధాన సమస్యగా మారాయని, దీనిపై సిటిజన్ పోలీసింగ్ విధానం ఉంటే మంచిదని అభిప్రాయపడ్డారు. పారిశుద్ధ్య కార్మికుల కొరత కారణంగా నగరంలో అనేక ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Details
'జనంబాట'తో ప్రజల ముందుకు
సీతాఫల్‌మండి ప్రభుత్వ పాఠశాల సమీపంలో అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయని, అక్కడ స్కూల్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అంబర్‌పేట-ముసరాంబాగ్ బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్‌కు తాగునీరు అందించే ఏర్పాట్లు చేయాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 'జనంబాట' కార్యక్రమం ద్వారా అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయని కవిత తెలిపారు.