Mumbai Family Deaths: పుచ్చకాయలో విషం లేదు.. ముంబయి ఫ్యామిలీ డెత్ మిస్టరీ కేసులో బిగ్ ట్విస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలో ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బిర్యానీ, పుచ్చకాయ తిన్న కొద్ది గంటల్లోనే మృతి చెందిన ఘటన తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ కేసులో మిస్టరీ ఇంకా వీడకపోయినా, తాజాగా కొన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. వారు తిన్న పుచ్చకాయలో ఎలాంటి కల్తీ జరగలేదని పరీక్షల్లో స్పష్టమైంది. అయితే మృతులలో కొందరి శరీర అవయవాలు ఆకుపచ్చగా మారడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ముంబైకి చెందిన అబ్దుల్లా డోకాడియా, ఆయన భార్య నస్రీన్, ఇద్దరు కుమార్తెలు ఆదివారం తెల్లవారుజామున వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఒకరి తరువాత ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
వివరాలు
ఎలాంటి కల్తీ చేయలేదు
మరణానికి ముందు వారు కొన్ని గంటల వ్యవధిలో బిర్యానీ, పుచ్చకాయ తిన్నట్లు గుర్తించారు. దీంతో మొదట ఇది ఫుడ్ పాయిజనింగ్ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. ఈ నేపథ్యంలో వారు తిన్న పుచ్చకాయతో పాటు ఇతర ఆహార పదార్థాల నమూనాలను ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారులు పరీక్షించారు. ఆ పరీక్షల్లో ఆహారంలో ఎలాంటి కల్తీ జరగలేదని తేలింది. పుచ్చకాయలో సింథటిక్ రంగులు గానీ, తియ్యదనం కోసం ఉపయోగించే కృత్రిమ రసాయనాల ఆనవాళ్లు గానీ కనిపించలేదని అధికారులు తెలిపారు. అయితే బ్యాక్టీరియా పరీక్షలు నిర్వహించలేదని వారు పేర్కొన్నారు. దీంతో బ్యాక్టీరియా కారణంగా కూడా ఈ మరణాలు జరిగి ఉండొచ్చని, లేకపోతే విషపదార్థాల వినియోగం కూడా కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
కొన్ని భాగాలను ఆకుపచ్చ రంగులోకి మారాయి
మరోవైపు పోస్టుమార్టం నివేదికలో కూడా కీలక విషయాలు బయటపడ్డాయి. మృతుల్లో కొందరి మెదడు, గుండె, జీర్ణాశయంలోని కొన్ని భాగాలు ఆకుపచ్చ రంగులోకి మారినట్లు గుర్తించారు. సాధారణ ఫుడ్ పాయిజనింగ్‌లో ఇలాంటి లక్షణాలు కనిపించవని, ఇది ఏదైనా విషప్రయోగానికి సంకేతమై ఉండొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదనంగా అబ్దుల్లా డోకాడియా శరీరంలో మార్ఫిన్ అనే శక్తివంతమైన ఓపియాడ్ గుర్తించినట్లు వెల్లడైంది. సాధారణంగా ఈ ఔషధాన్ని వైద్యుల పర్యవేక్షణలోనే ఉపయోగిస్తారు. ఆయన చికిత్సలో భాగంగా దీన్ని తీసుకున్నారా? లేదా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఇచ్చారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.