LOADING...
Telangana: కనీసం మూడు కోర్‌ బ్రాంచ్‌లు ఉండాల్సిందే.. బీటెక్‌ సీట్ల పెంపుపై ఏఐసీటీఈ కఠిన నిబంధనలు
బీటెక్‌ సీట్ల పెంపుపై ఏఐసీటీఈ కఠిన నిబంధనలు

Telangana: కనీసం మూడు కోర్‌ బ్రాంచ్‌లు ఉండాల్సిందే.. బీటెక్‌ సీట్ల పెంపుపై ఏఐసీటీఈ కఠిన నిబంధనలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 08, 2025
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

బీటెక్‌ కోర్సుల్లో సీట్లు పెంచుకోవాలనుకునే కళాశాలలకు ఈసారి నుంచి మరింత కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటివరకు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ) గుర్తింపు ఉంటే అదనపు సీట్లు మంజూరు చేసేవారు. ఇక నుంచి అది ఒక్కటే సరిపోదని, కనీసంగా మూడు కోర్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌లు తప్పనిసరిగా ఉండాలంటూ అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ నిబంధన ఉన్నప్పటికీ, వాటిలో కనీసం రెండు కంప్యూటర్‌కు సంబంధించినవి కాని కోర్సులే ఉండాలని స్పష్టతనిచ్చింది. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌కు దూరమైన కనీసం రెండు కోర్‌ బ్రాంచ్‌లు కళాశాలలో కొనసాగితేనే సీట్ల పెంపునకు అనుమతి ఇస్తామని ప్రకటించింది.

వివరాలు 

గత ఏడాది వరకు ఎన్‌బీఏ గుర్తింపుతోనే సీట్లు పెంచుకునే అవకాశం

వచ్చే విద్యాసంవత్సరం 2026-27కు సంబంధించిన అనుమతుల విధాన పత్రాన్ని ఏఐసీటీఈ తాజాగా విడుదల చేసింది. ఇటీవలి కాలంలో ఇంజినీరింగ్‌ కళాశాలలు కోర్‌ బ్రాంచ్‌లు తగ్గించి, సీఎస్‌ఈనే ప్రధానంగా మార్చుకుంటుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసీఈ, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్‌ వంటి సంప్రదాయ కోర్సుల స్థానంలో సీఎస్‌ఈ-ఏఐ, డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ వంటి స్పెషలైజేషన్‌ కోర్సులు పెరుగుతుండటంతోనే ఏఐసీటీఈ ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది వరకు ఎన్‌బీఏ గుర్తింపుతోనే సీట్లు పెంచుకునే అవకాశం ఉండేది. ఈసారి నుంచి ఆ వెసులుబాటు ఉండదని స్పష్టంగా తెలిపింది.

వివరాలు 

ఆగస్టు 14 నుంచి ఫస్టియర్‌ తరగతులు ప్రారంభం 

ఈసారి అనుమతుల ప్రక్రియను కూడా ముందుగానే పూర్తి చేయనున్నట్లు ఏఐసీటీఈ ప్రకటించింది. గతంలో జూన్‌ నెల వరకూ అనుమతులు జారీ అయ్యేవి. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ 30 నాటికే కళాశాలలకు అనుమతులు మంజూరు చేయనున్నారు. ఆ తర్వాత సంబంధిత యూనివర్సిటీలు మే 31 నాటికల్లా అనుబంధ గుర్తింపును ఇవ్వాల్సి ఉంటుంది. బీటెక్‌ మొదటి సంవత్సరం తరగతులు ఆగస్టు 14 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. ఇప్పటివరకు ఉద్యోగుల్లో ఉన్నవారి కోసం సాయంత్రం వేళ నిర్వహించే కోర్సులను ప్రారంభించాలంటే, ఆ కళాశాలలో కనీసం మూడు సంవత్సరాల పాటు రెగ్యులర్‌ సీట్లు సగటున 80 శాతం నిండాలి. అప్పుడే ఏఐసీటీఈ అనుమతి ఇచ్చేది. ఈ ఏడాది నుంచి ఆ నిబంధనను పూర్తిగా తొలగించారు.

Advertisement

వివరాలు 

అనుభవం ఆధారిత అభ్యసన కోర్సులను ప్రయోగాత్మకంగా అమలులోకి..

నిబంధనలకు అనుగుణంగా కళాశాలలు పని చేస్తుంటే సరిపోతుందని, సాయంత్రం కోర్సులను నేరుగా మంజూరు చేస్తామని ప్రకటించారు. అనుభవం ఆధారిత అభ్యసన కోర్సులను ప్రయోగాత్మకంగా అమలులోకి తీసుకురానున్నారు. ఇందులో విద్యార్థులు వారి విద్యలో 50 శాతం సమయం పరిశ్రమలలో పనిచేస్తూ అనుభవాన్ని సంపాదిస్తారు. పని చేస్తూనే నేర్చుకునే విధానంలో ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, పరిశ్రమలకు సంబంధించిన అసైన్‌మెంట్‌ల ద్వారా శిక్షణ పొందుతారు. ఉద్యోగులు లేదా తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలనుకునే వారు ఈ కోర్సులకు అర్హులు.

Advertisement

వివరాలు 

ఇంజినీరింగేతర యూజీ, పీజీ కోర్సుల్లో కోటాను 25 శాతానికి పెంపు:  ఏఐసీటీఈ 

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌ జాబితాలో చోటు దక్కించుకున్న కళాశాలలకే ఈ ప్రత్యేక కోర్సులకు అనుమతి ఇస్తారు. ఆయా కళాశాలలు వార్షికంగా కనీసం రూ.100 కోట్ల టర్నోవర్‌ కలిగిన పరిశ్రమలతో ఎంవోయూ ఒప్పందాలు కుదుర్చుకోవాలి. సిలబస్‌ను కూడా కళాశాలల అధ్యాపకులు, పరిశ్రమల నిపుణులు కలిసి రూపొందిస్తారు. విదేశీ విద్యార్థుల కోసమూ సీట్ల పరిమాణాన్ని పెంచారు. ఇంతవరకూ యూజీ, పీజీ కోర్సుల్లో సూపర్‌న్యూమరరీ కోటాలో 15 శాతం సీట్లు కేటాయించేవారు. ఇక నుంచి ఇంజినీరింగ్‌ పీజీ కోర్సులు, అలాగే ఇంజినీరింగేతర యూజీ, పీజీ కోర్సుల్లో ఈ కోటాను 25 శాతానికి పెంచినట్లు ఏఐసీటీఈ తెలిపింది.

Advertisement