Narendra Modi: 2025లో భారత్ సాధించిన ఘన విజయాలు ఇవే: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
'మన్‌కీ బాత్' కార్యక్రమం 129వ ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా 2025లో భారత్ సాధించిన గర్వకారణమైన క్షణాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ తన శక్తిసామర్థ్యాలను ప్రపంచ దేశాలకు స్పష్టంగా చాటిందని పేర్కొన్నారు. దేశ భద్రత విషయంలో తమ ప్రభుత్వానికి ఉన్న అచంచలమైన నిబద్ధతకు ఇది నిదర్శనమని తెలిపారు. ఈ ఆపరేషన్ దేశంలోని ప్రతి పౌరుడికి గర్వకారణంగా నిలిచిందన్నారు. 'వందేమాతరం' 150 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా కూడా ఇదే దేశభక్తి, ఐక్యత ప్రజల్లో ప్రతిబింబించిందని మోదీ వ్యాఖ్యానించారు. క్రీడల పరంగా కూడా ఈ ఏడాది చిరస్మరణీయమైందని ప్రధాని తెలిపారు.
Details
తొలి భారతీయుడిగా శుభాన్షు శుక్లా చరిత్ర
12 ఏళ్ల తర్వాత భారత పురుషుల క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం దేశానికి గొప్ప విజయమని అన్నారు. అదే విధంగా భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారి వన్డే ప్రపంచ కప్‌ను సొంతం చేసుకొని చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. మహిళల అంధుల జట్టు టీ20 ప్రపంచ కప్‌ను గెలిచి ప్రపంచానికి భారత ప్రతిభను చాటిందని ప్రశంసించారు. అంతరిక్ష రంగంలోనూ 2025 భారత్‌కు గర్వకారణమైన ఏడాదిగా నిలిచిందని మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తొలి భారతీయుడిగా శుభాన్షు శుక్లా చరిత్ర సృష్టించారని, ఆయన సాధన దేశ యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
Details
ప్రపంచ దేశాలను భారత్ ఆశ్చర్యపరుస్తోంది
కోట్లాది మంది పాల్గొన్న మహా కుంభమేళాను సమర్థవంతంగా, శాంతియుతంగా నిర్వహించి భారత్ ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచిందని ప్రధాని తెలిపారు. అయోధ్య రామాలయంలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమం ప్రతి హిందువుకు గర్వకారణంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలు, కీలక నిర్ణయాలను కూడా ఆయన ప్రస్తావించారు. 2025లో దేశ ప్రజలు చూపిన ఐక్యత, సామరస్యాన్ని కొనసాగిస్తూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు. రాబోయే సంవత్సరంలో దేశాభివృద్ధి మరింత వేగవంతం చేయడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుందని ఆయన హామీ ఇచ్చారు.