Chevella Bus Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి మూడు ప్రధానమైన కారణాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్నో కలలతో సొంత ఊరికి వెళ్లి, తిరిగి నగరానికి బయల్దేరిన ప్రయాణికులకు ఆ బస్సు ప్రయాణం చివరిదైపోయింది. వారంతపు మధురానుభూతులను హృదయంలో దాచుకుని, సంతోషంగా బస్సెక్కిన వారు కొద్ది నిమిషాల్లోనే మృత్యువును ఎదుర్కోవాల్సి వచ్చింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం అనేక కుటుంబాలను కబళించింది. నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఓవర్‌లోడింగ్, రాంగ్‌రూట్.. ఇవన్నీ కలసి 19 మంది ప్రాణాలను బలిగొన్నాయి.
Details
టిప్పర్ అతివేగం.. నిర్లక్ష్యానికి మూలం
చేవెళ్ల సమీపంలో ఓవర్‌లోడెడ్ టిప్పర్ నియంత్రణ కోల్పోయి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. గుంతలతో నిండిన సింగిల్ రోడ్డు పరిస్థితులు ప్రమాద తీవ్రతను మరింత పెంచాయి. టిప్పర్, బస్సు రెండూ ఓవర్‌లోడ్ కావడంతో చావుకూడా ఓవర్‌లోడే అయింది. బస్సు కండక్టర్ రాధా ఫిర్యాదుతో చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే టిప్పర్ డ్రైవర్ ఆకాష్ ప్రమాదంలోనే మరణించాడు. డ్రైవర్ రాంగ్ రూట్‌లోకి వెళ్లడం వెనక గుంతలు తప్పించే ప్రయత్నమేనా? అన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
Details
రేవంత్ రెడ్డి సమీక్ష, డీజీపీ పర్యటన
ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రమాద పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రమాదానికి కారణమైన నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనపై బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మరోవైపు డీజీపీ ఘటన స్థలాన్ని సందర్శించి దర్యాప్తు పర్యవేక్షించనున్నారు. ఆర్టీసీ స్పష్టీకరణ టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలంగాణ ఆర్టీసీ అధికారులు తెలిపారు. రోడ్డు మలుపులో వేగం అదుపు తప్పి టిప్పర్ ఎదురుగా వచ్చిన బస్సును ఢీకొట్టిందని వివరించారు. ఆర్టీసీ బస్సు పూర్తి ఫిట్‌నెస్‌లో ఉందని, డ్రైవర్ రికార్డులో గతంలో ఎలాంటి ప్రమాదాలు లేవని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు.
Details
మృతులకు ఎక్స్‌గ్రేషియా.. క్షతగాత్రులకు చికిత్స
ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. 10 మందిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, మిగతావారు చేవెళ్లలోని పట్నం మహేందర్‌రెడ్డి హాస్పిటల్, లలిత హాస్పిటల్‌లలో చికిత్స పొందుతున్నారు. స్వల్ప గాయాలతో ఉన్నవారు చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు, కేంద్రం నుంచి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ గాయపడిన వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు.
Details
ఎఫ్ఐఆర్, విచారణ ప్రారంభం
కండక్టర్ రాధా, మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదులపై చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. టిప్పర్ యజమాని లక్ష్మణ్ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. కంకర ఓవర్‌లోడింగ్‌కు కారణమైన స్టోన్ క్రషర్ యజమానులు, కన్‌స్ట్రక్షన్ కంపెనీ యజమానులపై కూడా విచారణ కొనసాగుతోంది. ఇలాంటి నిర్లక్ష్యాలు మళ్లీ జరగకుండా ప్రభుత్వ చర్యలే ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.