
Siddaramaiah: 'వారు ఇన్ఫోసిస్ కాబట్టి వారికి అన్నీ తెలుసా?' ఇన్ఫోసిస్ మూర్తిని విమర్శించిన సిద్ధరామయ్య
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలో జరుగుతున్న సామాజిక-ఆర్థిక సర్వేపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్.ఆర్. నారాయణమూర్తి,సుధామూర్తిలకు కొన్ని అపోహలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ఈ సర్వేను వారు వెనకబడిన వర్గాలపై మాత్రమే జరుగుతోందని భావిస్తున్నారని ఆయన వివరించారు. ఈ సర్వేను నారాయణమూర్తి దంపతులు తిరస్కరిస్తూ.. తమ కుటుంబం వెనకబడిన వర్గాలకు చెందిన కుటుంబం కాదని, అందువల్ల ఈ సమీక్షలో పాల్గొనటం వల్ల కమిషన్ గానీ, ప్రభుత్వానికి గానీ ప్రయోజనం చేకూరదని వివరణ ఇవ్వడంపై సీఎం ఇలా మాట్లాడారు.
వివరాలు
ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు నెలకు రూ.2 వేల ఆర్థిక సహాయం
"ఇది వెనకబడిన తరగతుల సర్వే కాదు, మొత్తం రాష్ట్రంలోని ఏడు కోట్ల జనాభాపై జరుగుతున్న సమగ్ర సర్వే. ఈ విషయం మేము ఇప్పటికే 20 సార్లు వివరించాం. ఎవరికైనా తమ సమాచారం ఇవ్వాలనిపిస్తే స్వేచ్ఛగా ఇవ్వొచ్చు. ఈ సర్వే ఉద్దేశం ప్రజలు సరిగ్గా అర్థం చేసుకోవాలి. కానీ నారాయణమూర్తి దంపతులు అర్థం చేసుకోలేకపోతే నేను ఏమి చేయగలను?" ని సిద్ధరామయ్య పేర్కొన్నారు. అదే సందర్భంలో, రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలను కూడా సీఎం ప్రస్తావించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు నెలకు రూ.2 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామని గుర్తు చేశారు.
వివరాలు
ఆ సమయంలో నారాయణమూర్తి దంపతులు ఏ సమాధానం చెబుతారో..
అయితే, "ఈ పథకాల్లో అగ్రవర్ణ మహిళలు లేదా దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్న మహిళలు లేరా?" అని సీఎం ప్రశ్నించారు. ఈ సర్వే గురించి మంత్రులు పలు మార్లు స్పష్టమైన వివరణ ఇచ్చినా, కొందరికి ఇంకా అపోహలు తొలగలేదని అన్నారు. అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు కుల గణన దిశగా అడుగులు వేస్తోందని సూచిస్తూ, "ఆ సమయంలో నారాయణమూర్తి దంపతులు ఏ సమాధానం చెబుతారో చూడాలి," అన్నారు. తప్పుడు సమాచారం ఆధారంగానే వారికి ఈ అపోహలు ఏర్పడ్డాయని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
ఆర్‌ఎస్‌ఎస్ గురించి కాదు..
రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరుగుతుందనే ప్రచారంపై సీఎం స్పందించారు. "మార్పు అనేది విప్లవం కాదు. సందర్భం లేకుండా ఇటువంటి వాదనలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు," అని చెప్పారు. అలాగే, ప్రభుత్వ స్థలాలు, విద్యాసంస్థల్లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలను నిషేధిస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. "ఇది ఆర్‌ఎస్‌ఎస్ సంస్థను టార్గెట్ చేయడం కాదు. ఏ సంస్థ అయినా ప్రభుత్వ ప్రాంగణంలో కార్యక్రమాలు నిర్వహించాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందే," అని సీఎం స్పష్టం చేశారు.