Anganwadi Workers: జగన్ మాట మార్చాడు.. ఎక్కువ జీతం ఇస్తానని చెప్పి మోసం చేశారు : అంగన్‌వాడీ వర్కర్స్
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్‌వాడీలు (Anganwadi Workers) నిరసనకు దిగారు. ప్రభుత్వంతో రెండు రోజులుగా జరిపిన చర్చలు విఫలం కావడంతో ఇవాళ నుంచి అంగన్‌వాడీ వర్కర్స్ నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూలు ఈ సమ్మెకు మద్దతు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సీడీపీవో కార్యాలయాలు, మండల కేంద్రాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు నిరాహారదీక్షలు, ఆందోళనలు చేపడుతున్నారు. కనీస వేతనం రూ.26వేలు ఇచ్చి, గ్రాట్యుటీతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు కోరారు.
సమ్మెలో అంగన్ వాడీలు, అయాలు
తమకు జీతాలు మాత్రం పెంచట్లేదని, నాసిరకం ఫోన్లు ఇచ్చి యాప్‌లతో విధులకు సంబంధించిన వివరాలను అప్డేట్ చేయమంటే ఎలా అని అంగన్ వాడీలు ప్రశ్నించారు. తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తానని చెప్పి, ఇప్పుడేమో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట మార్చారని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. దాదాపు లక్షమంది వరకు అంగన్ వాడీలు, అయాలు సమ్మె బాట పట్టారు.