LOADING...
Free Coaching: సైన్యంలోకి అడుగులు వేసే యువతకు.. పైసా ఫీజు లేకుండా దేశ శిక్షణ..! 
పైసా ఫీజు లేకుండా దేశ శిక్షణ..!

Free Coaching: సైన్యంలోకి అడుగులు వేసే యువతకు.. పైసా ఫీజు లేకుండా దేశ శిక్షణ..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 19, 2025
05:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ సరిహద్దుల్లో యూనిఫాం ధరించి గస్తీ కాయాలన్నది అనేక మంది యువత కల. ఆ కలను నిజం చేసుకునేందుకు వారు చేసే శ్రమ అంతా ఇంతా కాదు.తెల్లవారకముందే లేచి కిలోమీటర్ల కొద్దీ పరుగులు తీయడం,కఠినమైన వ్యాయామాలు చేయడం వారి నిత్యక్రియగా మారిపోతుంది. ముఖ్యంగా గ్రామాలు,చిన్న పట్టణాల్లో ఈ దృశ్యాలు తరచూ కనిపిస్తుంటాయి. అయితే,దేహదారుఢ్య పరీక్షల్లో విజయం సాధించినా... సరైన మార్గదర్శకత్వం,సమగ్ర శిక్షణ లేకపోవడంతో చాలామంది రాత పరీక్షల్లో విఫలమవుతున్నారు. ఒకటి రెండు సార్లు ప్రయత్నించి నిరాశతో వేరే ఉద్యోగాల వైపు మళ్లిపోతున్నారు. అలాంటి యువతకు దారి చూపుతూ,ఆశకు అండగా నిలుస్తోంది ఒడిశాలోని బాలాసోర్ పట్టణంలో ఉన్న కళింగ ఉత్కల్ డిఫెన్స్ అకాడమీ. ఈ అకాడమీలో యువతకు ఎలాంటి ఫీజు లేకుండా శిక్షణ అందిస్తున్నారు.

వివరాలు 

ముగ్గురు ఆలోచనల నుంచి పుట్టింది 

గ్రామీణ ప్రాంత యువత ఎదుర్కొనే ఇబ్బందులను అనుభవించి, వాటిని ఎదుర్కొని సైన్యంలో స్థానం సంపాదించిన అమూల్య బింధాని, మయూర్ దాస్, బిజయ్ ప్రధాన్. ఈ ముగ్గురి ఆలోచనల నుంచే వచ్చిందే ఈ అకాడమీ. తమలాంటి కష్టాలు మరెవరికీ ఎదురవకూడదన్న తపనతో 2021లో కళింగ ఉత్కల్ డిఫెన్స్ అకాడమీని ప్రారంభించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతకే ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మొదట 40మంది అభ్యర్థులతో ప్రారంభమైన ఈ అకాడమీలో ప్రస్తుతం సుమారు 70 మంది యువతీయువకులు శిక్షణ పొందుతున్నారు. దేహదారుఢ్య పరీక్షలు,రాత పరీక్షలకు సంబంధించిన శిక్షణ మొత్తం పూర్తిగా ఉచితం. భోజనానికి అయ్యే ఖర్చును మాత్రం అభ్యర్థులే భరించాల్సి ఉంటుంది. అయితే ఆ ఖర్చు కూడా భరించలేని పరిస్థితుల్లో ఉన్నవారికి రాయితీలు కల్పిస్తారు.

వివరాలు 

షరతులు వర్తిస్తాయ్‌ 

అభ్యర్థులకు రాత పరీక్షల శిక్షణ అందించేందుకు నలుగురు ఉపాధ్యాయులను నియమించారు. అంతేకాదు,దేహదారుఢ్య సాధన కోసం 14 మంది వ్యాయామ శిక్షకులు నిరంతరం అందుబాటులో ఉంటారు. ఉదయం 5 గంటలకే శిక్షణ ప్రారంభమవుతుంది. వ్యాయామాలు,తరగతులు,ప్రాక్టీస్ టెస్టులు.. ఇదే అక్కడి రోజువారీ జీవితం. ఇప్పటికే ఉద్యోగాల్లో స్థిరపడిన అభ్యర్థులు సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు అకాడమీకి వచ్చి, శిక్షణ పొందుతున్న యువతకు తమ అనుభవాలను పంచుకుంటారు. ఒకటి రెండు రోజులు అక్కడే ఉండి చిన్నచిన్న మెళకువలు నేర్పుతుంటారు. అంతేకాదు, తమ జీతంలో నుంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని అకాడమీకి విరాళంగా అందిస్తూ దాని నిర్వహణకు తోడ్పడుతున్నారు.

Advertisement

వివరాలు 

ఇది అకాడమీ కాదు.. ఓ కుటుంబం 

ఈ విధంగానే అకాడమీ కొనసాగుతోందని బిజయ్ ప్రధాన్ తెలిపారు. ఇప్పటివరకు ఇక్కడ శిక్షణ పొందిన 40 మంది ఇండియన్ ఆర్మీ, బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, పోలీస్ శాఖల్లో వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఇక్కడికి వచ్చే ప్రతి అభ్యర్థిదీ ఓ కథ. సరైన శిక్షణ లేక పలుమార్లు విఫలమై ఆశలు కోల్పోయినవారు కొందరైతే... పేదరికం కారణంగా శిక్షణ కోసం డబ్బులు ఖర్చు చేయలేక తమ కలలు నెరవేరుతాయో లేదోనన్న సందిగ్ధంలో ఇక్కడికి వచ్చినవారు మరికొందరు. అలాంటి వారందరినీ అక్కున చేర్చుకొని దిక్సూచీలా పని చేస్తోంది ఈ అకాడమీ.

Advertisement

వివరాలు 

ఈ అకాడమీని తల్లిలా భావిస్తూ..

అందుకే శిక్షణ పొందుతున్న యువతకు ఈ అకాడమీ మానసికంగా దగ్గరవుతోంది. తమ కలలకు రెక్కలు ఇచ్చిన ఈ అకాడమీని తల్లిలా భావిస్తూ, ఇంటికి వచ్చిన ప్రతిసారీ ఇక్కడికి వచ్చి సేదతీరుతుంటారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్నవారికి మార్గనిర్దేశం చేస్తూ, ఒకటి రెండు రోజులు వారితో కలిసి గడిపి సంతృప్తి పొందుతారు. అందుకే అక్కడ అకాడమీ కంటే కుటుంబ వాతావరణమే ఎక్కువగా కనిపిస్తుంది. నిజంగా ప్రశంసనీయం కదూ...!

Advertisement