LOADING...
Lok Sabha: నేడు లోక్‌సభ ముందుకు మూడు ప్రధాన బిల్లులు.. 3 రోజులు ప్రత్యేక సమావేశాలు
నేడు లోక్‌సభ ముందుకు మూడు ప్రధాన బిల్లులు.. 3 రోజులు ప్రత్యేక సమావేశాలు

Lok Sabha: నేడు లోక్‌సభ ముందుకు మూడు ప్రధాన బిల్లులు.. 3 రోజులు ప్రత్యేక సమావేశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 16, 2026
08:14 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజకీయ డబుల్‌ ధమాకాకు రంగం సిద్ధమైంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల అమలు, అలాగే నియోజకవర్గాల పెంపు-పునర్విభజన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు కీలక దశకు చేరుకున్నాయి. 2029సాధారణ ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్రం మూడు ముఖ్యమైన బిల్లులను గురువారం ఉదయం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుల ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్యను 550 నుంచి గరిష్ఠంగా 850కి పెంచడం, 2011 జనగణన ఆధారంగా దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడం,అలాగే దీనికోసం ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేయడం వంటి అంశాలు ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించనున్నారు. ఈ మూడు బిల్లులపై ఒక్కో సభలో 18గంటల చర్చ జరగనుంది.

వివరాలు 

రాజ్యాంగ సవరణ బిల్లుకు కనీసం 360 మంది మద్దతు అవసరం

వీటిలో ఒకటి రాజ్యాంగ సవరణకు సంబంధించినది కావడంతో దానికి మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. మిగతా రెండు సాధారణ చట్ట బిల్లులు కావడంతో సాధారణ మెజారిటీ సరిపోతుంది. ప్రస్తుతం లోక్‌సభలో 540 మంది సభ్యులు ఉండగా, రాజ్యాంగ సవరణ బిల్లుకు కనీసం 360 మంది మద్దతు అవసరం. అధికార కూటమికి 292 మంది మద్దతు మాత్రమే ఉండటంతో మిగిలిన మద్దతు ఎలా సమకూర్చుకుంటారన్నది కీలకంగా మారింది. సభకు హాజరైన సభ్యులలో రెండొంతుల మెజారిటీ వచ్చినా బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. ప్రతిపక్ష సభ్యులు గైర్హాజరైతే అధికార పక్షానికి అది అనుకూలంగా మారుతుంది. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షాలు రాజ్యాంగ సవరణ బిల్లును ఓడిస్తామని స్పష్టం చేయడంతో ఉత్కంఠ నెలకొంది.

వివరాలు 

543 స్థానాల ఆధారంగానే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్

మరోవైపు, డీలిమిటేషన్‌కు సంబంధించిన రెండు బిల్లులను ఒకేసారి పరిశీలించేందుకు లోక్‌సభ నిబంధనలను సడలించాలని కేంద్రం నిర్ణయించింది. ఇదిలా ఉండగా, ప్రతిపక్ష కూటమి సమావేశంలో 21 పార్టీలు మహిళా రిజర్వేషన్లకు పూర్తి మద్దతు ప్రకటించినప్పటికీ, నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా నిలిచాయి. ప్రస్తుత 543 స్థానాల ఆధారంగానే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశాయి. పునర్విభజన వల్ల దక్షిణ, ఈశాన్య, చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. అయితే కేంద్రం మాత్రం అన్ని రాష్ట్రాల్లో స్థానాలను సమానంగా సగం మేర పెంచడం ద్వారా సమతౌల్యం కాపాడుతామని హామీ ఇస్తోంది. ఈ అంశంపై సభలో స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపింది. అధికార కూటమి ఈ మూడు బిల్లులు ఆమోదం పొందుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

Advertisement

వివరాలు 

డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని ప్రతిపక్షాలు ఏకగ్రీవ నిర్ణయం 

మహిళా రిజర్వేషన్ల అమలులో వెనుకబడిన వర్గాలకు కూడా వాటా కల్పించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జనగణన పూర్తయ్యాకే ఈ ప్రక్రియ చేపట్టాలని వారు పేర్కొంటున్నారు. లేకపోతే ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా నిర్ణయించాయి. ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ చర్యలు చేపడుతోందని ఆరోపించాయి. మరోవైపు కేంద్రం మాత్రం అన్ని పార్టీలతో సంప్రదింపుల అనంతరం నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Advertisement