Telangana: 16 జిల్లాల్లో మామిడి పంటకు తెగుళ్ల ప్రభావం.. నిరాశలో రైతు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తగ్గడంతో మామిడి చెట్లలో పుష్పోత్పత్తి సమృద్ధిగా కనిపించింది. దీంతో ఈ సీజన్‌లో పండ్ల దిగుబడి అధికంగా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ గత నెల రోజులుగా వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా పుష్పించే దశలో తామర పురుగుల ప్రబలింపు గణనీయంగా పెరిగింది. ఫలితంగా కొమ్మలపై బూజు ఏర్పడి, పిందెలు,లేత మామిడి కాయలు రాలిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణవ్యాప్తంగా సుమారు 8 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జగిత్యాల, మహబూబాబాద్, కరీంనగర్, నిజామాబాద్ తదితర 16 జిల్లాల్లో తామర తెగులు తీవ్రంగా ప్రభావం చూపుతోంది.
వివరాలు
సూర్యకాంతి లోపించి, తేమ అధికంగా ఉండటం తామర విస్తరణకు కారణం
ఈ ప్రభావం వల్ల దిగుబడిలో సుమారు 30 శాతం వరకు తగ్గుదల సంభవించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత రెండు దశాబ్దాల్లో ఇంతటి తీవ్రతతో తెగుళ్లను చూడలేదని నాగర్‌కర్నూల్‌కు చెందిన మామిడి తోట యజమాని ప్రసాద్ వెల్లడించారు. వయసు ఎక్కువగా ఉన్న తోటల్లో తామర తెగులు మరింత ప్రమాదకరంగా మారిందని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు. చెట్ల కొమ్మలు గుబురుగా పెరగడం వల్ల సూర్యకాంతి లోపించి, తేమ అధికంగా ఉండటం తామర విస్తరణకు కారణమవుతోందని వారు పేర్కొన్నారు.
వివరాలు
అధికారులు సూచించిన జాగ్రత్తలు ఇవి:
తోటలో సూర్యరశ్మి చొరబడేలా,తేమ అధికం కాకుండా ఉండేలా చెట్ల కొమ్మలను నిరంతరం కత్తిరించాలి. 10సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న చెట్లకు 4నుండి 6డ్రిప్పర్ల ద్వారా నీటిని అందించాలి. సరైన తేమ కోసం ప్రతి చెట్టుకు రోజుకు 2నుంచి 3గంటల పాటు నీరు ఇవ్వాలి. ప్రతి చెట్టుకు అరకిలో చొప్పున యూరియా,మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేయాలి. కాయలు రాలిపోకుండా ఉండేందుకు 20రోజుల వ్యవధిలో లీటరు నీటికి 0.25మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ ద్రావణాన్ని రెండుసార్లు పిచికారీ చేయాలి. కాయల పరిమాణం పెరగడానికి లీటరు నీటికి 10గ్రాముల పొటాషియం నైట్రేట్, 1.25గ్రాముల బోరాన్ (20%)కలిపి పిచికారీ చేయాలని అధికారులు సూచించారు. ఈ సూచనలు పాటిస్తే తామర తెగులును నియంత్రించడంతో పాటు దిగుబడిని కాపాడుకోవచ్చని నిపుణులు పేర్కొన్నారు.