Thrissur school: చదువుకునే రోజుల్లో అలా చేసారని.. టీచర్లపై పూర్వ విద్యార్థి కాల్పులు
కేరళ త్రిసూర్‌లోని వివేకోదయం స్కూల్లో పూర్వ విద్యార్థి హల్‌చల్ చేశాడు. తుపాకీతో తరగతి గదిలోకి ప్రవేశించి కాల్పులు జరిపి పాఠశాలలో భయానక వాతావరణం సృష్టించాడు. త్రిసూర్ నగరంలోని ఒక ముఖ్యమైన ఎయిడెడ్ పాఠశాలలో వివేకోదయం ఒకటి. నిందితుడుని ములాయం ప్రాంతానికి చెందిన జగన్ అనే వ్యక్తిగా గుర్తించారు. జగన్ పాఠశాలలోకి ప్రవేశించి భయాందోళనకు గురిచేస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. జగన్ స్టాఫ్ రూమ్‌లోకి ప్రవేశించి కుర్చీలో కూర్చొని తుపాకీతో బెదిరించినట్లు ఫుటేజీలో స్పష్టంగా ఉంది. మూడుసార్లు కాల్పులు జరిగినా ఎవరికీ గాయాలు కాలేదు. కాల్పులు జరిపిన తర్వాత జగన్ పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకున్నారు.
టోపీ పెట్టుకోనివ్వలేదని..
స్టాఫ్‌రూమ్‌లో జగన్ తుపాకీతో అటు, ఇటు తిరుగుతున్నట్లు సీసీ పుటేజీలో కనపడుతుంది. ఈ క్రమంలో జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్కూల్‌లో చదువుకునే రోజుల్లో తనను టోపీ పెట్టుకోనివ్వలేదని అతను స్టాఫ్ రూమ్‌లో అన్నట్లు సీసీ పుటేజీలో రికార్డు అయ్యింది. అయితే అప్పుడు జగన్‌ను టోపీ పెట్టుకోనివ్వని టీచర్లపై అతను ధ్వేషం పెంచుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, పోలీసులు జగన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జగన్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జగన్ ప్రస్తుతం త్రిసూర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు.