LOADING...
TTD: ఇక గ్లోబల్‌ బ్రాండ్‌గా టీటీడీ... విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం,నిర్వహణకు కసరత్తు 
ఇక గ్లోబల్‌ బ్రాండ్‌గా టీటీడీ... విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం,నిర్వహణకు కసరత్తు

TTD: ఇక గ్లోబల్‌ బ్రాండ్‌గా టీటీడీ... విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం,నిర్వహణకు కసరత్తు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 22, 2025
08:32 am

ఈ వార్తాకథనం ఏంటి

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి మహిమాన్విత వైభవాన్ని ప్రపంచమంతటా చాటిచెప్పే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానాలు (తితిదే)విస్తృత స్థాయి ప్రణాళికను సిద్ధం చేసింది. ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనలను ఆధారంగా తీసుకుని, శ్రీవారి ఆస్తులు,ఆలయాలను అంతర్జాతీయంగా విస్తరించేందుకు పాలక మండలి చర్యలను వేగవంతం చేసింది. ఈక్రమంలో నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి,విదేశాల్లో ఆలయాల నిర్మాణం,వాటి నిర్వహణకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై సవివర అధ్యయనం చేయించింది. కమిటీ సమర్పించిన ప్రతిపాదనలపై తితిదే బోర్డు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపింది. అయితే కార్యాచరణను మొదలు పెట్టే ముందు దేవాదాయ శాఖతో పాటు ఆర్‌బీఐ,ఫెరా,ఫెమా వంటి సంస్థల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండటంతో,తాత్కాలికంగా ఈ నిర్ణయాన్ని వాయిదా వేసింది.

వివరాలు 

శ్రీవారి ఆలయాలు నిర్మాణానికి విదేశాల నుండి పెద్ద ఎత్తున విన్నపాలు

అవసరమైన అన్ని అనుమతులు లభించిన వెంటనే, స్పష్టమైన కార్యాచరణతో ప్రపంచంలోని వివిధ దేశాల్లో శ్రీనివాసుడి ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. విదేశాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలంటూ తితిదేకు పెద్ద ఎత్తున విన్నపాలు వస్తున్నాయి. యునైటెడ్ కింగ్‌డమ్‌ నుంచి ఇప్పటికే నాలుగు ప్రతిపాదనలు, జర్మనీ నుంచి మూడు ప్రతిపాదనలు అందాయి. అలాగే ఆస్ట్రేలియా, శ్రీలంక, నెదర్లాండ్స్, స్వీడన్, స్విట్జర్లాండ్, పోలాండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్‌ తదితర దేశాల నుంచీ కూడా అభ్యర్థనలు వచ్చినట్లు తితిదే వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో నిర్మించే శ్రీవారి ఆలయాలను ఏ విధంగా నిర్వహించాలన్న అంశంపై తితిదే మూడు ప్రధాన నమూనాలను పరిశీలిస్తోంది.

వివరాలు 

 మూడు ప్రధాన నమూనాలు

మొదటి నమూనా పూర్తిగా తితిదే ఆధ్వర్యంలో ఉండే విధానం. ఇందులో భూమి కొనుగోలు నుంచి ఆలయ నిర్మాణం, అర్చకుల నియామకం, రోజువారీ నిర్వహణ వరకు అన్ని బాధ్యతలను తితిదేనే భరిస్తుంది. చట్టపరమైన కోణంలో ఇది అత్యంత సురక్షితమైన మార్గమని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. రెండో నమూనా ప్రకారం, విదేశాల్లోని స్థానిక హిందూ సంస్థలు ఆలయాలను నిర్మిస్తే, తితిదే తరఫున ఆధ్యాత్మికం,సాంకేతిక సహకారం మాత్రమే అందజేస్తారు. మూడో నమూనాలో తితిదే, స్థానిక కమిటీలు కలిసి నిధులు సమీకరించి, సంయుక్తంగా ఆలయ నిర్వహణ చేపడతాయి. ఈ మూడు మార్గాల్లో మొదటి నమూనా ద్వారానే తితిదే బ్రాండ్‌ విలువను, అలాగే పూజా విధానాల్లో స్వచ్ఛతను పూర్తిగా కాపాడగలమని నిపుణులు స్పష్టంగా సూచించారు.

Advertisement

వివరాలు 

 'రింగ్‌ ఫెన్సింగ్‌' విధానం 

విదేశాల్లో నిర్మించే ఆలయాల్లోనూ భారతీయ శిల్పకళ స్పష్టంగా ప్రతిబింబించేలా చర్యలు తీసుకోనున్నారు. తిరుమలలో అనుసరించే ఆగమశాస్త్ర విధానాల ప్రకారమే పూజలు జరగేలా తితిదే నుంచి అర్చకులను పంపించనున్నారు. అలాగే భారతదేశం నుంచి ప్రత్యేక శిల్పులను పంపించి, మన సంప్రదాయం, శిల్పసౌందర్యం ఉట్టిపడేలా ఆలయ నిర్మాణాలు చేపడతారు. ఆయా దేశాల నిబంధనలకు అనుగుణంగా అక్కడ ప్రత్యేక లాభాపేక్ష లేని సంస్థలను ఏర్పాటు చేసి, తితిదేకు ఎలాంటి నష్టం కలగకుండా 'రింగ్‌ ఫెన్సింగ్‌' విధానాన్ని అమలు చేయనున్నారు. అంతేకాదు, అంతర్జాతీయ స్థాయిలో తితిదే పేరును ట్రేడ్‌మార్క్‌గా నమోదు చేయాలని కూడా నిర్ణయించారు.

Advertisement