Loading...
Tirupati: రేణిగుంట విమానాశ్రయానికి ఈ-వీసా కేంద్రం.. అక్టోబర్‌ నుంచి అంతర్జాతీయ సేవలు
రేణిగుంట విమానాశ్రయానికి ఈ-వీసా కేంద్రం.. అక్టోబర్‌ నుంచి అంతర్జాతీయ సేవలు

Tirupati: రేణిగుంట విమానాశ్రయానికి ఈ-వీసా కేంద్రం.. అక్టోబర్‌ నుంచి అంతర్జాతీయ సేవలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2026
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ-వీసా కేంద్రం మంజూరైంది. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయానశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేంద్రం సేవలు అందుబాటులోకి వస్తే శ్రీవారి దర్శనం కోసం విదేశాల నుంచి తిరుపతికి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత సులభం కానుంది. ఇప్పటివరకు విదేశీ ప్రయాణికులు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి అంతర్జాతీయ విమానాశ్రయాలకు చేరుకుని అక్కడే ఈ-వీసా ప్రక్రియను పూర్తిచేసుకున్న తర్వాత తిరుపతికి వచ్చేవారు. ఇకపై ఆ ఇబ్బంది లేకుండా నేరుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకునే అవకాశం కలుగుతుంది.

వివరాలు 

తొమ్మిదేళ్ల తర్వాత మంజూరు

రేణిగుంట నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించాలనే డిమాండ్‌ చాలాకాలంగా ఉంది.

తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించే ప్రతిపాదనకు 2007లో అప్పటి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

అనంతరం 2017లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ అయింది.

అయితే అంతర్జాతీయ హోదా వచ్చినప్పటికీ ఇక్కడి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు మాత్రం ప్రారంభం కాలేదు.

నోటిఫికేషన్‌ వెలువడిన తొమ్మిదేళ్ల తర్వాత తాజాగా ఈ-వీసా కేంద్రం మంజూరైంది.

వివరాలు 

ఆన్‌లైన్‌లోనే ఈ-వీసా దరఖాస్తు

విదేశీయులు భారత్‌ పర్యటనకు రావాలంటే ఈ-వీసాను ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు.

ఇందుకోసం భారత రాయబార కార్యాలయానికి నేరుగా వెళ్లాల్సిన అవసరం లేదు.

ప్రయాణానికి కనీసం పది రోజుల ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, నిర్ణీత ఫీజును చెల్లించాలి.

ఈ-వీసా కోసం వచ్చే దరఖాస్తుల్లో దాదాపు 95 శాతాన్ని 72 గంటల్లోనే పరిశీలించి క్లియర్‌ చేస్తారు.

అనంతరం దరఖాస్తుదారులకు ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం పంపిస్తారు. ఆ అనుమతిని ప్రింట్‌ తీసుకుని ప్రయాణికులు భారత్‌కు రావచ్చు.

విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఇమ్మిగ్రేషన్‌ అధికారులు పాస్‌పోర్ట్‌పై వీసా స్టాంప్‌ చేస్తారు.

ADVERTISEMENT

వివరాలు 

గల్ఫ్‌ ప్రయాణికులకూ ప్రయోజనం

రాయలసీమ ప్రాంతం నుంచి ఉపాధి కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు.

తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రస్తుతం అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో వారు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ విమానాశ్రయాల మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు.

దీంతో ప్రయాణ సమయం, ఖర్చులు పెరగడంతో పాటు అదనపు భారం పడుతోంది.

ఈ నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సేవలను అందుబాటులోకి తీసుకురావడంపై విమానయానశాఖ దృష్టి సారించింది.

అక్టోబర్‌ నుంచి అంతర్జాతీయ సేవలను ప్రారంభించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ADVERTISEMENT