LOADING...
Tirupati: తిరుపతిలో రూ.470 కోట్లతో ఇంటర్‌మోడల్ బస్ టెర్మినల్.. ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్‌ ప్రతిపాదన
ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్‌ ప్రతిపాదన

Tirupati: తిరుపతిలో రూ.470 కోట్లతో ఇంటర్‌మోడల్ బస్ టెర్మినల్.. ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్‌ ప్రతిపాదన

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 06, 2026
08:53 am

ఈ వార్తాకథనం ఏంటి

తిరుపతిలో ప్రస్తుతం ఉన్న ప్రధాన బస్టాండ్ స్థానంలో ఆధునిక సదుపాయాలతో ఇంటర్‌మోడల్ బస్ టెర్మినల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ ప్రాజెక్టును ఇంజినీరింగ్,ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో చేపట్టడం ఉత్తమమని అధికారులు నిర్ణయించారు. ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన ఈ స్థలంలో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్) ఆధ్వర్యంలో నిర్మాణం జరగనుంది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.470 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (బీవోటీ), హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ (హామ్), ఈపీసీ విధానాలను పరిశీలించిన ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్ చివరికి ఈపీసీ విధానమే అనుకూలమని తేల్చి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

వివరాలు 

సకల సౌకర్యాలతో టెర్మినల్

తిరుపతి బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్, తిరుమలతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలకు ప్రయాణించే వారికి మెరుగైన రవాణా, మౌలిక వసతులు అందించేందుకు ఈ ప్రాజెక్టుకు 'ఇంటర్‌మోడల్ బస్ టెర్మినల్' అనే పేరు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కోసం రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్ లిమిటెడ్ (రైట్స్)ను సలహా సంస్థగా నియమించి డీపీఆర్ తయారు చేయించారు.ప్రస్తుతం తిరుపతి బస్టాండ్ 10.87 ఎకరాలు, డిపో 2.31 ఎకరాలు కలిపి మొత్తం 13.18 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 7.11 ఎకరాలను బస్ టెర్మినల్ మరియు ఇతర వసతుల నిర్మాణానికి వినియోగించనున్నారు.రోడ్డుకు ఆనుకుని ఉన్న 4.29 ఎకరాలను వాణిజ్య అభివృద్ధికి కేటాయిస్తారు. అదనంగా 99 సెంట్లను రోడ్డు కోసం,మరో 79 సెంట్లను ఫ్లైఓవర్ నిర్మాణానికి వినియోగించనున్నారు.

వివరాలు 

సకల సౌకర్యాలతో టెర్మినల్

టెర్మినల్‌లో వాహనాల పార్కింగ్ కోసం సెల్లార్‌లో రెండు అంతస్తులు నిర్మించనున్నారు. వీటిలో 4.96 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. బస్ టెర్మినల్,ఇతర అవసరాల కోసం 1.54 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు, వాణిజ్య అవసరాలకు 3.94 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం చేపడతారు. మొత్తం కలిపి 10.45 లక్షల చదరపు అడుగుల బిల్ట్‌అప్ ఏరియా ఉండనుంది.

Advertisement

వివరాలు 

గ్రౌండ్ ఫ్లోర్ అంతా టెర్మినల్‌కే

ఈ ప్రాజెక్టులో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తాన్ని బస్ టెర్మినల్‌కు కేటాయిస్తారు. మొత్తం 98 ప్లాట్‌ఫామ్‌లు నిర్మించనుండగా, అదనంగా మరో 50 బస్సులు నిలిపేందుకు ప్రాంగణంలో స్థలం ఏర్పాటు చేస్తారు. గ్రౌండ్ ఫ్లోర్ పైన 10 అంతస్తులు నిర్మించి వాటిని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తారు. పై అంతస్తుల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు ఏర్పాటు చేస్తారు. అలాగే వివిధ దుకాణాలు, బ్యాంకులు, ఇతర సంస్థలకు స్థలాన్ని కేటాయిస్తారు. పదో అంతస్తు పైభాగంలో హెలిప్యాడ్ నిర్మాణాన్ని కూడా ప్రతిపాదించారు. బస్టాండ్,రైల్వేస్టేషన్ మధ్య అనుసంధానం కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించనున్నారు.

Advertisement

వివరాలు 

భాగస్వామ్య సంస్థలతో చర్చలు

ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టే ఆసక్తిగల సంస్థలతో అధికారులు ఇటీవల సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించారు. వాణిజ్య భాగం ద్వారా వచ్చే ఆదాయం, అందులో ఆర్టీసీకి లభించే వాటా వంటి అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్,ఆర్టీసీ మధ్య ఒప్పంద కాలవ్యవధి కూడా నిర్ణయించాల్సి ఉంది. ఇక టెర్మినల్ నిర్మాణ సమయంలో ప్రస్తుత బస్టాండ్‌ను తాత్కాలికంగా ఇతర ప్రాంతానికి తరలించాల్సి ఉంటుంది. దీనికి 5 ఎకరాలు, డిపో కోసం మరో 5 ఎకరాలు కేటాయించాలని తిరుపతి కలెక్టర్‌ను ఆర్టీసీ కోరింది.

Advertisement