Andhra Pradesh: ఎల్లుండి వరల్డ్ క్వాంటం డే.. ఏపీలో టెక్నాలజీ కొత్త యుగానికి శ్రీకారం
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక మైలురాయిని చేరుకోబోతోంది. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో రెండు అత్యాధునిక క్వాంటం టెస్ట్ బెడ్లను ప్రారంభించనున్నారు. గన్నవరంలోని మేధా టవర్స్‌తో పాటు రాజధానిలోని SRM విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఈ సదుపాయాలు ఏర్పాటవుతున్నాయి. ఈ ప్రారంభంతో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీని నెలకొల్పిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించనుంది. అమరావతి క్వాంటం వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా వస్తున్న ఈ కేంద్రాలు రాష్ట్రంలో నూతన సాంకేతిక యుగానికి నాంది పలకనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు '1ఎస్', '1క్యూ' పేర్లతో రెండు వేర్వేరు క్వాంటం టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీలను ఆవిష్కరించనున్నారు.
వివరాలు
ఉపకరణాల తయారీ, పరిశోధనలలో కీలక పాత్ర
ఈ కేంద్రాల ద్వారా క్వాంటం కంప్యూటర్ హార్డ్‌వేర్‌ను పరీక్షించి, ప్రమాణీకరించే సామర్థ్యం అమరావతి క్వాంటం వ్యాలీకి లభించనుంది. గన్నవరంలోని మేధా టవర్స్‌లో క్యూబిటెక్ సంస్థ ఒక టెస్ట్ బెడ్‌ను ఏర్పాటు చేయగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్‌లో మరో కేంద్రం నిర్మితమవుతోంది. అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన ఈ టెస్ట్ బెడ్లు మైనస్ 273 డిగ్రీల సెల్సియస్ అతిశీతల ఉష్ణోగ్రతల వద్ద పనిచేస్తాయి. క్వాంటం ఉపకరణాల తయారీ, పరిశోధనలలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. ముఖ్యంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని 'ఓపెన్ యాక్సెస్' విధానంలో అందుబాటులో ఉంచనుండటం విశేషం. దీని వల్ల క్వాంటం రంగంలో పనిచేసే కంపెనీలు, పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులకు విస్తృత అవకాశాలు కలగనున్నాయి.
వివరాలు
'1ఎస్' పేరిట సూపర్‌కండక్టింగ్ టెక్నాలజీ ఆధారంగా మరో టెస్ట్ బెడ్
ఈ రెండు క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీల్లో పూర్తిగా స్వదేశీ సాంకేతిక ఉపకరణాలనే వినియోగించడం ప్రత్యేకత. మేధా టవర్స్‌లో క్యూబిటెక్ సంస్థ '1క్యూ' పేరిట టెస్ట్ బెడ్‌ను ఏర్పాటు చేయగా, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో '1ఎస్' పేరిట సూపర్‌కండక్టింగ్ టెక్నాలజీ ఆధారంగా మరో టెస్ట్ బెడ్‌ను అభివృద్ధి చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ వంటి దేశంలోని అగ్రశ్రేణి పరిశోధనా సంస్థలు సహకారం అందించాయి.
వివరాలు
వర్చువల్ ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు
ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేషనల్ క్వాంటం మిషన్ అధికారులు, ఐఐటీ ప్రొఫెసర్లు, క్వాంటం రంగ శాస్త్రవేత్తలు, ఇన్నోవేషన్ స్టార్టప్ ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్లు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు, కళాశాలల నుంచి సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులు వర్చువల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం రాష్ట్ర యువతలో సాంకేతిక విద్యపై ఆసక్తిని మరింత పెంచుతుందని భావిస్తున్నారు.