Page Loader
నేటి నుంచి ఏపీలో వర్షాలు..తెలంగాణకు మరో 3 రోజుల పాటు తీవ్ర ఎండలు
ఏపీలో వర్షం కురిసే అవకాశం

నేటి నుంచి ఏపీలో వర్షాలు..తెలంగాణకు మరో 3 రోజుల పాటు తీవ్ర ఎండలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 19, 2023
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎప్పుడూ లేని రీతిలో నైరుతి రుతుపవనాలు అటు అన్నదాతలను, ఇటు సాధారణ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ఒక్క కేరళనే కాదు, ఏకంగా దక్షిణ భారతదేశం అంతటా వర్షాలు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. దీని కారణంగా ఈ ఏడు పంటల దిగుబడి బాగా తగ్గిపోయి ఇబ్బందులు ఎదుర్కొనే దుస్థితి తలెత్తనుంది. గుజరాత్ ను ముప్పతిప్పలు పెట్టిన బిపర్‌జాయ్ తుఫాను నైరుతి రుతుపవనంపై పెను ప్రభావమే చూపించింది. వాతావరణంలో వేడి ఉష్ణోగ్రత స్థిరంగా కొనసాగుతుండటం వల్ల చల్లదనం మాయమై నైరుతి కదలిక ఆగిపోయింది. దీంతో వానలు కురవడం లేదు. ప్రస్తుతానికైతే బిపర్‌జాయ్ తుపాను ప్రభావం తగ్గిపోయింది కనుక రుతుపవనాలు చురుగ్గా కదిలి వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు.

DETAILS

ఏపీలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు 

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో ఇవాళ్టి నుంచి తేలికపాటితో కూడిన మోస్తరు వర్షాలు కురువనున్నట్లు వాతావరణ అధికారులు అంచనా వేశారు. అటు కోస్తా ప్రాంతంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఆంధ్ర ప్రాంతాంలోని కొన్ని జిల్లాల్లో వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రతలు మరింత కాలం కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధిక వేడి వాతావరణంతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే చాలా తక్కువ ప్రాంతాల్లో నేటి నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు అంచనా వేశారు.

DETAILS

తెలంగాణ ప్రజలకు వాతావరణం అలెర్ట్.. బయటకు వెళ్లొద్దని అధికారుల సూచన

తెలంగాణలో వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలు మరో 3 రోజుల వరకు కొనసాగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకూ ఎండ సమయంలో బయట పనులకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. అయితే రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు మాత్రం భారత వాతావరణ విభాగం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, సూర్యాపేట, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోని ప్రజలు వీలైనంత వరకు ఇళ్లు దాటకూడదన్నారు. మరోవైపు నైరుతి జోరందుకోవడంతో కేరళలోని పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కిలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.