Tomato Prices: సామాన్య ప్రజలకు షాకిస్తున్న టమాటా ధరలు.. కిలో రూ.100..!
నెలన్నర క్రితం వరకు కిలో రూ.20-30 ఉన్న టమాట ధర ఇప్పుడు రూ.100కు చేరింది. దీంతో సామాన్య ప్రజలు టమాటను కొనలేమని వాపోతున్నారు. ప్రస్తుతం రైతు బజార్లలో, హోల్‌సేల్ మార్కెట్‌లలో టమాట ధర రూ.60-80 ఉంటే, రిటైల్ మార్కెట్లలో ఇది రూ.100కు చేరువలో ఉంది. దీనికి ప్రధాన కారణం డిమాండ్‌కు సరిపడా టమాటా లేకపోవడమే అని వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో టమాట పంటలు దెబ్బతినడంతో, ధరలు అమాంతం పెరిగాయని వారు పేర్కొన్నారు. సాధారణంగా ఈ కాలంలో టమాట ధరలు తక్కువగా ఉండి, వేసవిలో పెరిగే అవకాశం ఉంటుంది.
ఇతర కూరగాయాల ధరల కూడా రెట్టింపు
కానీ వర్షాల ప్రభావంతో ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. కొత్త పంట వచ్చే వరకు ధరలు ఇలాగే ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. టమాట మాత్రమే కాదు, ఉల్లి, ఇతర కూరగాయల ధరలు కూడా రెట్టింపు అయ్యాయి. రైతు బజార్లలో కిలో ఉల్లి ధర రూ.50 ఉంటే, రిటైల్ మార్కెట్లలో రూ.60-70 వరకు ఉంది. బెండకాయలు రూ.70, బీన్స్ రూ.100, దొండ రూ.60, క్యాప్సికం రూ.80, బీరకాయ రూ.70 వంటి ఇతర కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయి.