Cyclone Tej: అరేబియా సముద్రంలో అల్లకల్లోలం.. రేపు తీవ్ర తుపాను మారనున్న 'తేజ్' సైక్లోన్
ఆగ్నేయ, నైరుతి అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగండం అల్పపీడనంగా మారిందని, శనివారం తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఇక ఆదివారం నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ తుపానుకు 'తేజ్' అనే పేరు పెట్టారు. ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన రెండో తుఫాను ఇది. తుపాను ఒమన్ దేశంతో పాటు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ తీరాల వైపు కదులుతుందని అంచనా ఐఎండీ అంచనా వేసింది. నైరుతి అరేబియా సముద్రంలో అలలు పోటెత్తడంతో అక్టోబర్ 21 నుంచి 23 వరకు పరిస్థితి అసాధారణంగా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
అక్టోబర్ 23, 24 తేదీల్లో వర్షాలు
పశ్చిమ అరేబియా సముద్రంలో అక్టోబరు 22నుంచి 25వ తేదీ వరకు సముద్రంలో పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయని ఐఎండీ వెల్లడించింది. ఈ నెల 23 నుంచి సముద్రంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని సూచించింది. ఈ క్రమంలో మత్స్యకారులు అక్టోబరు 26వరకు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. సముద్రంలో ఉన్నవారు తీరానికి తిరిగి రావాలని సూచించింది. తుపాను పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుంది కాబట్టి, గుజరాత్‌పై ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను కారణంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్టోబర్ 23, 24 తేదీల్లో కేరళ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కురిసే అవకాశం ఉందని పేర్కొంది.