LOADING...
Andhra news: ఏపీలో కేరళ తరహా పర్యాటక సేవలు.. ప్రైవేటు భాగస్వామ్యంతో అల్ట్రా లగ్జరీ బోట్లు
ఏపీలో కేరళ తరహా పర్యాటక సేవలు..ప్రైవేటు భాగస్వామ్యంతో అల్ట్రా లగ్జరీ బోట్లు

Andhra news: ఏపీలో కేరళ తరహా పర్యాటక సేవలు.. ప్రైవేటు భాగస్వామ్యంతో అల్ట్రా లగ్జరీ బోట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 18, 2025
08:25 am

ఈ వార్తాకథనం ఏంటి

పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే దిశగా ఆంధ్రప్రదేశ్'లో కీలక అడుగు పడింది. విజయవాడలోని బెర్మ్‌ పార్కు,అలాగే బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌ బ్యాక్‌ వాటర్‌ ప్రాంతాల్లో పర్యాటకులను ఆకట్టుకునేలా ఐదు అల్ట్రా లగ్జరీ బోట్లు నడిపేందుకు ప్రైవేటు ఆపరేటర్లు ముందుకు వచ్చారు. ఈప్రతిపాదనలకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఇప్పటికే ప్రాథమిక అనుమతులు మంజూరు చేసింది. రెండుప్రాంతాల్లో కలిపి ఐదు జెట్టీల నిర్మాణంతో పాటు బోట్లకు అవసరమైన విద్యుత్తు సదుపాయాలను కూడా సంస్థే కల్పించనుంది. బోట్ల డిజైన్‌లకు సంబంధించిన డ్రాయింగ్‌లన 'ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ'వద్ద అనుమతులు తీసుకున్న అనంతరం,ప్రైవేటు ఆపరేటర్లు నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. 2026 అక్టోబరు నాటికి ఈ లగ్జరీ బోట్లు పర్యాటకులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

వివరాలు 

బెర్మ్‌ పార్కు నుంచి పవిత్ర సంగమం వరకు రెండు బోట్లు

కేరళ తరహాలో రాష్ట్రంలోని నదులు, సముద్రం బ్యాక్‌ వాటర్‌లలో విలాసవంతమైన అల్ట్రా లగ్జరీ బోట్‌ సేవలను ప్రవేశపెట్టాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గత ఏడాది నుంచి ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందుకోసం ఆసక్తి ఉన్న ప్రైవేటు సంస్థలను ఆహ్వానించగా,కేరళలో ఇప్పటికే ఈ సేవలు అందిస్తున్న ఒక సంస్థ,ఏపీకి చెందిన మరో సంస్థతో కలిసి ఉమ్మడి భాగస్వామ్యంగా ముందుకు వచ్చింది. బెర్మ్‌ పార్కు నుంచి పవిత్ర సంగమం వరకు రెండు బోట్లు నడిపేందుకు ఈ సంస్థలు ప్రతిపాదనలు సమర్పించాయి. ఇందుకు సంబంధించిన 20 కిలోమీటర్ల మేర సర్వే కూడా పూర్తయ్యింది. ఒక బోటును ఐదు పడకగదులతో పాటు వంద మందికి సరిపడే కాన్ఫరెన్స్‌ హాల్‌తో రూపొందించనున్నారు.

వివరాలు 

బోటులో 200 మంది ఒకేసారి భోజనం చేసేలా డిజైన్

మరో బోటును 200 మంది ఒకేసారి భోజనం చేసేలా డిజైన్‌ చేయనున్నారు. రాత్రి సమయంలో భవానీ ద్వీపం వద్ద బోట్లు నిలిపేందుకు అక్కడ ప్రత్యేకంగా జెట్టీ నిర్మించి, విద్యుత్తు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇదే తరహాలో బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌ బ్యాక్‌ వాటర్‌లో నాగరాజు కెనాల్‌ నుంచి నిజాంపట్నం వరకు మూడు అల్ట్రా లగ్జరీ బోట్లు ప్రైవేటు సంస్థలు నడపనున్నాయి. ఈ మూడు బోట్లలో ఒక్కో బోటులో వరుసగా 9, 3, 2 పడకగదులు ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

వివరాలు 

ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా నడిపే అవకాశాలపై పర్యాటకాభివృద్ధి సంస్థ ఫీజిబిలిటీ సర్వే

బ్యాక్‌ వాటర్‌లో సుమారు 30 కిలోమీటర్ల మేర బోటులో ప్రయాణించే అవకాశం ఉండగా, మార్గమధ్యంలో ఉన్న అందమైన ప్రాంతాలను కూడా పర్యాటకుల కోసం గుర్తించారు. అలాగే విశాఖ తీరంలో, రాజమహేంద్రవరం-కాకినాడ మధ్య గోదావరి నదిలో, నాగార్జునసాగర్‌లోనూ అల్ట్రా డీలక్స్‌ బోట్లు ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా నడిపే అవకాశాలపై పర్యాటకాభివృద్ధి సంస్థ ఫీజిబిలిటీ సర్వే నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఆసక్తి గల సంస్థలను ఆహ్వానించనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement