Delhi AQI: ఢిల్లీలో కొనసాగుతున్న తీవ్ర వాయు కాలుష్యం.. మూడో రోజూ 400 దాటిన AQI..
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీ వాయు కాలుష్యంతో ఇంకా తీవ్రంగా పోరాడుతోంది. వరుసగా మూడో రోజు బుధవారం కూడా గాలి నాణ్యత సూచీ (AQI) 400 మార్క్ దాటి "తీవ్ర" వర్గంలోనే నమోదైంది. నగరమంతా దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో అనేక ప్రాంతాల్లో దృశ్యమానత గణనీయంగా తగ్గిపోయింది. దీనివల్ల ప్రజలు స్వచ్ఛమైన గాలి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) విడుదల చేసిన వివరాల ప్రకారం, బుధవారం ఉదయం గీతా కాలనీ-లక్ష్మీనగర్ రోడ్ ప్రాంతంలో AQI 413గా నమోదైంది. ఇండియా గేట్, కర్తవ్య పథ్ పరిసరాల్లో కూడా విషపూరిత పొగమంచు వ్యాపించి అక్కడ AQI 408గా ఉంది.
వివరాలు
నగరంలోని ఇతర ప్రధాన ప్రాంతాల్లో పరిస్థితి
నగరంలోని ఇతర ప్రధాన ప్రాంతాల్లో కూడా పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. ఆనంద్ విహార్‌లో 438, అశోక్ విహార్‌లో 439, చాందినీ చౌక్‌లో 449, ద్వారకా సెక్టార్-8లో 422, ఐటీఓలో 433, జహంగీర్‌పురిలో 446, ఆర్‌కే పురంలో 432, రోహిణిలో 442గా గాలి నాణ్యత నమోదైంది. నిపుణుల హెచ్చరిక ప్రకారం,ఇంతటి కాలుష్యానికి దీర్ఘకాలంగా గురైతే తీవ్రమైన శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గాలి నాణ్యత మరింత దిగజారుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)-దశ 3 కింద కీలక చర్యలు చేపట్టి, 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థుల కోసం బుధవారం నుంచి హైబ్రిడ్ విధానంలో తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది.
వివరాలు
ఢిల్లీ విద్యాశాఖ సర్క్యులర్ జారీ
"జీఆర్ఏపీ ఫేజ్-3 కింద అవసరమైన భద్రతా చర్యలు వేగంగా అమలు అవుతున్నాయి. బుధవారం నుంచి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకు హాజరుకావాలి. పాఠశాలల్లో హైబ్రిడ్ విధానం అమలులో ఉంటుంది," అని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా ఢిల్లీ విద్యాశాఖ సర్క్యులర్ జారీ చేసింది.
వివరాలు
ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోని కాలుష్య పరిస్థితులపై సమీక్షా సమావేశం
అందులో,"విద్యాశాఖ, ఎన్‌డీఎంసీ,ఎంసీడీ,ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డుల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు తక్షణమే 5వ తరగతి వరకు విద్యార్థుల కోసం హైబ్రిడ్ (ఫిజికల్ మరియు ఆన్‌లైన్) విధానాన్ని అమలు చేయాలి. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ విధానం కొనసాగుతుంది," అని పేర్కొంది. అదే సమయంలో, ఈ మార్పుల గురించి తల్లిదండ్రులకు వెంటనే సమాచారం ఇవ్వాలని పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ డైరెక్టర్ వేదితా రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా,కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ మంగళవారం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోని కాలుష్య పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కాలుష్య నియంత్రణ చర్యల అమలు వివరాలతో కూడిన నివేదికలను వెంటనే సమర్పించాలని ఆయన ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల అధికారులను ఆదేశించారు.