LOADING...
Vladimir Putin's India: వాణిజ్యం,రక్షణ ఒప్పందాలు,కార్మిక ఒప్పందాలు… వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన దేని గురించి?
వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన దేని గురించి?

Vladimir Putin's India: వాణిజ్యం,రక్షణ ఒప్పందాలు,కార్మిక ఒప్పందాలు… వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన దేని గురించి?

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 03, 2025
02:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

2022లో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు రానున్నారు. భారత్-రష్యాల మధ్య ఎన్నో దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ, యుద్ధ పరిస్థితుల కారణంగా పశ్చిమ దేశాల నుంచి, ముఖ్యంగా అమెరికా నుంచి భారత్‌పై రష్యాతో సంబంధాలు తగ్గించాలనే ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధాని నరేంద్ర మోదీతో పుతిన్ సమావేశంలో ప్రధానంగా వాణిజ్యం,రక్షణ ఒప్పందాలు, ఇంధన సహకారం, అణుశక్తి, ఉద్యోగాల అంశాలు చర్చకు రావనున్నాయి. వాణిజ్యంపై కేంద్రీకృతంగా రెండు దేశాలు వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయని క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి.

వివరాలు 

ముడి చమురు కొనుగోళ్ల అంశం కీలకం

కొన్ని దేశాలు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నా,వాటిని అధిగమించి స్థానిక కరెన్సీలలో వాణిజ్య లావాదేవీలు సాగించే వ్యవస్థ ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయి. పుతిన్ పర్యటనలో ఇండియా-రష్యా బిజినెస్ ఫోరమ్‌లో పాల్గొననుండగా,ఇంజినీరింగ్ ఉత్పత్తులు, సముద్ర ఆహార సరఫరా,డిజిటల్ సేవలు,ఔషధ ఉత్పత్తుల ఎగుమతులు పెంపుపై దృష్టి సారించనున్నారు. ముడి చమురు కొనుగోళ్ల అంశం కీలకంగా ఉండనుండగా, ఈ విషయమై రోస్నెఫ్ట్,గాజ్‌ప్రోమ్‌నెఫ్ట్ సంస్థల అధినేతలు కూడా పుతిన్‌తో కలిసి వస్తున్నట్టు తెలుస్తోంది. సఖాలిన్-1 ప్రాజెక్టులో ఓఎన్‌జీసీ విదేశ్‌కు 20శాతం వాటాను తిరిగి కల్పించాలనే అంశాన్ని భారత్ లేవనెత్తే అవకాశం ఉంది. రక్షణ రంగంలో ఎస్-400క్షిపణి వ్యవస్థల కొనుగోలు, ఆధునిక ఎస్-500 ప్రోమెథియస్ వ్యవస్థపై చర్చలు, సు-57యుద్ధ విమానాల కోసం కనీసం రెండు స్క్వాడ్రన్ల కొనుగోలు అంశం చర్చకు రానున్నాయి.

వివరాలు 

70 వేల మందికి పైగా భారతీయులకు ఉద్యోగాలు 

అలాగే కీలక రక్షణ ఒప్పందమైన రెసిప్రొకల్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్ ఒప్పందంపై కూడా ఇద్దరు నేతలు చర్చించనున్నారు. పౌర అణుశక్తి రంగంలో చిన్న సామర్థ్య అణు రియాక్టర్ల ఏర్పాటు కోసం సహకార ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగాలు, ప్రజా సంబంధాల దృష్ట్యా, రష్యాలో నిపుణ భారతీయ కార్మికులకు చట్టబద్ధ వలస మార్గాన్ని కల్పించే లేబర్ మొబిలిటీ ఒప్పందం కీలకంగా మారనుంది. సంవత్సరం చివరికి 70 వేల మందికి పైగా భారతీయులు అక్కడ ఉద్యోగాలు పొందే అవకాశమున్నట్టు అధికారులు చెబుతున్నారు.

Advertisement

వివరాలు 

అత్యంత ప్రధాన పర్యటనగా పుతిన్ భారత్ పర్యటన

రష్యా సైన్యంలో చేరిన భారతీయుల అంశంపై కూడా చర్చలు జరుగనున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై శాంతి ప్రయత్నాల గురించి మోదీ-పుతిన్ మధ్య చర్చ జరిగే అవకాశముంది. మొత్తంగా వ్యూహాత్మక, రక్షణ, ఇంధన, వాణిజ్య రంగాల్లో కీలక నిర్ణయాలకు దారితీసే అత్యంత ప్రధాన పర్యటనగా పుతిన్ భారత్ పర్యటనను రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement