Hyderabad: నూతన సంవత్సర వేడుకల వేళ.. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నేటి రాత్రి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నేటి రాత్రి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అదనపు ట్రాఫిక్ పోలీసు కమిషనర్ విశ్వప్రసాద్ పేర్కొన్నారు.
ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్‌ను అనుమతించరు.
అర్ధరాత్రి 2 గంటల వరకు హుస్సేన్‌సాగర్ చుట్టూ వాహనాల రాకపోకలపై అవసరాన్ని బట్టి ఆంక్షలు ఉంటాయి.
బేగంపేట్, టోలిచౌకీ మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మూసివేయబడతాయి.
పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే ఫ్లైఓవర్‌పై విమాన టికెట్లు కలిగిన ప్రయాణికులు మాత్రమే అనుమతించబడతారు.
వివరాలు
ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు
రాత్రి 10 గంటల నుంచి ప్రైవేటు ట్రావెల్ బస్సులు, లారీలు, హెవీ గూడ్స్, ప్యాసింజర్ వాహనాలు నగర పరిధిలోకి అనుమతించరు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రైవేటు బస్సులు తప్పనిసరిగా ఓఆర్‌ఆర్ మీదుగా వెళ్లాలి.
ట్యాంక్‌బండ్ ప్రాంతానికి కాలినడకన వెళ్లే సందర్శకులు సెక్రెటరియట్ విజిటర్స్ పార్కింగ్, ప్రసాద్ మల్టీప్లెక్స్ పక్కన హెచ్‌ఎండీఏ మైదానం, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం లేన్, రేస్ కోర్స్ రోడ్డు వద్ద వాహనాలు నిలిపేందుకు ఏర్పాటు చేశారు.
వీవీ విగ్రహం, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, షాదన్ కళాశాల వంటి అనేక ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది.
సైబరాబాద్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ ట్రాఫిక్ ఆంక్షలపై ఉత్తర్వులు జారీ చేస్తూ, ఇతర లైట్ మోటర్ వాహనాలు ఓఆర్‌ఆర్‌పై అనుమతించబడవని తెలిపారు.
వివరాలు
డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
డ్రైవర్లు యూనిఫార్మ్ ధరించి, డాక్యుమెంట్లు వెంట ఉంచుకోవాలి.ప్రయాణికులకు నిరాకరించడం, అదనపు ఛార్జీలు వసూలు చేయడం వంటి పరిస్థితులు ఎదురైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
బార్‌లు, పబ్‌లు, క్లబ్‌లు వినియోగదారులు మద్యం మత్తులో వాహనాలు నడపకుండా చూడాలని యాజమాన్యాలు బాధ్యత తీసుకోవాలి.
రాత్రి 8 గంటల నుంచి కమిషనరేట్ పరిధిలో విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తారు.
అవసరమైన ధ్రువపత్రాలు లేకుంటే వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటారు.
మైనర్ల డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా నడిపే వారి వాహనాలు కూడా స్వాధీనం చేసుకుని యజమానులపై కేసులు నమోదు చేస్తారు.
అధిక శబ్దం చేసే వాహనాలు, నెంబర్ బోర్డు లేని వాహనాలు ఆర్టీఏ అధికారులకు అప్పగిస్తారు. పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణించే వారిపై చర్యలు చేపడతారు.