Biryani Watermelon : బిర్యానీ, పుచ్చకాయ తిన్న తర్వాత విషాదం.. 12 గంటల్లో నలుగురు మృతి!
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సరదాగా బంధువుల ఇంటికి వెళ్లి విందు చేసి వచ్చిన ఒక కుటుంబం, కేవలం 12 గంటల వ్యవధిలోనే నలుగురు సభ్యులను కోల్పోయింది. ఈ దారుణ ఘటన ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. మృతుల్లో 13 ఏళ్ల బాలిక కూడా ఉండటం మరింత విషాదాన్ని మిగిల్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలో నివసించే అబ్దుల్లా కాదర్ (40) స్థానికంగా మొబైల్ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతని భార్య నస్రీన్ (35). వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శనివారం రాత్రి అబ్దుల్లా తన కుటుంబంతో కలిసి బంధువుల ఇంట్లో జరిగిన విందుకు హాజరయ్యాడు. అక్కడ బిర్యానీ భోజనం చేసిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు.
వివరాలు
ఫుడ్ పాయిజనింగ్ కారణమై ఉండొచ్చని అనుమానం
ఆ తర్వాత అర్ధరాత్రి సుమారు ఒక గంట సమయంలో కుటుంబ సభ్యులంతా పుచ్చకాయ తిన్నట్లు సమాచారం. అయితే ఆ తర్వాత ఏమి జరిగిందో స్పష్టంగా తెలియకపోయినా, ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో కుటుంబ సభ్యులందరికీ ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థితిని గమనించిన అబ్దుల్లా వెంటనే స్థానిక వైద్యుడిని పిలిపించాడు. కానీఅప్పటికే వారి ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో అబ్దుల్లా కాదర్ కుటుంబంలోని నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫుడ్ పాయిజనింగ్ కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.