
మహారాష్ట్ర భూషణ్ అవార్డు వేడుకలో విషాదం; వడదెబ్బకు 11మంది మృతి; 120మందికి అస్వస్థత
ఈ వార్తాకథనం ఏంటి
నవీ ముంబైలో ఆదివారం జరిగిన 'మహారాష్ట్ర భూషణ్' అవార్డు ఈవెంట్ విషాదకరంగా మారింది.
వడదెబ్బకు 11మంది మృతి చెందగా, 120మందికి పైగా ప్రజలు ఆస్పత్రి పాలయ్యారు.
అవార్డు వేడుకలను ఎండలో నిర్వహించడంతో పాటు ఎలాంటి షెడ్డూ ఏర్పాటు చేయకపోవడం వల్లే అనేక మంది వడదెబ్బకు గురైనట్లు తెలుస్తోంది.
హీట్‌స్ట్రోక్‌కు గురైన వారిని వైద్య సహాయం కోసం ఖార్ఘర్‌లోని టాటా ఆసుపత్రికి తరలించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వడదెబ్బతో ఆస్పత్రిలో చేరిన వారిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో చేరిన వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మహారాష్ట్ర
మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించిన సీఎం
మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, అడ్మిట్ అయిన వారికి సరైన వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
వడదెబ్బకు గురై చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని, వారి వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వమే డబ్బు చెల్లిస్తుందని సీఎం చెప్పారు.
రోగులకు అదనపు చికిత్స అవసరమైతే ప్రత్యేక ఆసుపత్రులకు తరలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది ప్రజలు వచ్చారని, వారిలో కొంతమందికి ఇలా జరగడం బాధాకరమని సీఎం అన్నారు.
మహారాష్ట్ర భూషణ్ అవార్డు పొందిన సామాజిక కార్యకర్త దత్తాత్రేయ నారాయణ్ అలియాస్ అప్పాసాహెబ్ ధర్మాధికారిని సత్కరిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ అవార్డు కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.