
TVK Vijay:విజయ్ సభలో విషాదం.. తొక్కిసలాటలో చిన్నారులతో సహా 31 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ప్రచార సభలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరూర్‌లో జరిగిన ఈ ఘటనలో ఇప్పటివరకు 31 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మరణించిన వారిలో పార్టీ కార్యకర్తలతో పాటు ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. విజయ్ సభకు భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఆయన ప్రసంగిస్తుండగా జనాన్ని నియంత్రించడం కష్టతరమైంది. ఈ క్రమంలో తొక్కిసలాట ఏర్పడి, పలువురు స్పృహ తప్పి కుప్పకూలారు. పరిస్థితి విషమించడంతో విజయ్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. అనంతరం అత్యవసరంగా అంబులెన్సులు అక్కడికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాయి.
Details
ప్రధాని మోదీ స్పందన
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'కరూర్‌లో జరిగిన ఈ దురదృష్టకర సంఘటన మనసును కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ కష్టసమయంలో వారికి ధైర్యం కలగాలని కోరుకుంటున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Details
సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'కరూర్ నుంచి వస్తున్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు అన్ని రకాల సహాయం అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించాను. సాధారణ పరిస్థితులు నెలకొనేలా పోలీసు ఉన్నతాధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించాను. వైద్యులు, పోలీసులకు సహకరించాలని కరూర్ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం స్టాలిన్ ఎక్స్‌లో పేర్కొన్నారు.