Loading...
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం.. కల్తీ మద్యం తాగి 12 మంది మృతి
మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం.. కల్తీ మద్యం తాగి 12 మంది మృతి

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం.. కల్తీ మద్యం తాగి 12 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2026
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో కల్తీ మద్యం పెను విషాదాన్ని మిగిల్చింది. అనుమానాస్పద విషపూరిత మద్యం సేవించి 12 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 10 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. ప్రభావిత గ్రామాల్లో వైద్య పరీక్షలు ప్రారంభించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పలు మద్యం దుకాణాలను అధికారులు సీల్ చేశారు.

వివరాలు

బాధ్యులపై కఠిన చర్యలు: సీఎం

ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

''సంబంధిత మంత్రి, అధికారులను వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించాను. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తాం. ఇలాంటి వాటిని మా ప్రభుత్వం ఎంతమాత్రం సహించదని సీఎం మీడియాకు తెలిపారు.

మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

వివరాలు

అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు

సాగర్ జిల్లాలో వరుస మరణాల నేపథ్యంలో అక్రమ, నకిలీ మద్యం విక్రయాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

'బాంబే విస్కీ' పేరుతో ఓ నకిలీ బ్రాండ్‌ను విక్రయిస్తున్నట్లు స్థానిక కథనాలు పేర్కొంటున్నాయి.

దీనిపై ఓ మద్యం కాంట్రాక్టర్ ఇటీవలే ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి.

అలాగే నాలుగు రోజుల క్రితం లైసెన్స్ పొందిన మద్యం కాంట్రాక్టర్లు ఎక్సైజ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలోనూ నకిలీ మద్యం విక్రయాలపై ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

మిథైల్ ఆల్కహాల్ పాయిజనింగ్‌గా అనుమానం

కల్తీ మద్యం సేవించి అస్వస్థతకు గురైన బాధితుల్లో తీవ్రమైన లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కొందరి శరీరం నీలంగా మారడం (సైనోసిస్), కండరాలు బిగుసుకుపోవడం** వంటి లక్షణాలను గుర్తించినట్లు చెప్పారు.

ఈ లక్షణాలను బట్టి ఇది 'మిథైల్ ఆల్కహాల్ పాయిజనింగ్' అయి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లు చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ దేవేష్ పటేరియా తెలిపారు.

'ప్రస్తుతం 9-10 మంది మరణించినట్లు మాకు సమాచారం ఉంది. మా వైద్య బృందాలు మూడు గ్రామాల్లో ఇంటింటి సర్వే చేస్తున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ADVERTISEMENT

వివరాలు

గ్రామాల్లో వైద్య శిబిరాలు.. ఆరు దుకాణాలు సీల్

గత 24 నుంచి 48 గంటల్లో మద్యం సేవించి వాంతులు, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి రావాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం నౌరా, ఘుగ్రు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.

ముందుజాగ్రత్త చర్యగా ఆయా ప్రాంతాల్లోని ఆరు మద్యం దుకాణాలను సీల్ చేశారు. అనుమానాస్పద మద్యం నమూనాలను కూడా అధికారులు సేకరించి పరీక్షల కోసం పంపించారు.

ఈ మద్యం అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు సరఫరా చేశారు? అనే కోణాల్లో పోలీసులు, పరిపాలన యంత్రాంగం దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు అందిన తర్వాతే మరణాలకు కచ్చితమైన కారణాలు నిర్ధారించగలమని అధికారులు వెల్లడించారు.

ADVERTISEMENT