Kurnool: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 13 మందికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో బొలెరో వాహనం,రెడీమిశ్రమ సరుకు లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఎమ్మిగనూరులోని ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉండగా, ఒక చిన్నారి కూడా ఉన్నట్టు తెలిసింది.
వివరాలు
శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం
కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌మంగళూరు ప్రాంతానికి చెందిన భక్తులు మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను కుమార్ (60), దీపిక వీణ (35), సునీల్ (40), బెల్లి (3), పుట్టమ్మ (60), మీనాక్షి (50), తాయమ్మ (60), లోలాక్షి గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని సహాయక చర్యలను వేగవంతం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విషాద ఘటనపై రాష్ట్ర మంత్రులు భరత్, జనార్దన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి ఉత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు వారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.