LOADING...
Emergency Landing: చెరుకు పొలంలో అత్యవసరంగా దిగిన శిక్షణ విమానం
చెరుకు పొలంలో అత్యవసరంగా దిగిన శిక్షణ విమానం

Emergency Landing: చెరుకు పొలంలో అత్యవసరంగా దిగిన శిక్షణ విమానం

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2026
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలో శిక్షణలో ఉన్న ఓ చిన్న విమానం అత్యవసరంగా చెరుకు పొలంలో దిగడం కలకలం రేపింది. రెడ్ బర్డ్ విమాన శిక్షణ కేంద్రానికి చెందిన ఈ విమానం సాంకేతిక సమస్య కారణంగా అత్యవసరంగా భూమిపైకి దించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన బారామతి సమీపంలోని గోజుబావి గ్రామం వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం సుమారు 8:40 గంటల సమయంలో శిక్షణలో భాగంగా విమానం గాల్లో ప్రయాణిస్తోంది. గ్రామానికి ఉత్తర దిశలో సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉండగా విమాన ఇంజిన్ ఒక్కసారిగా శక్తి కోల్పోయింది. దీంతో ప్రమాదాన్ని గుర్తించిన శిక్షణ పైలట్ అప్రమత్తమై సమీపంలోని చెరుకు పొలాన్ని గుర్తించి విమానాన్ని సురక్షితంగా దించాడు.

వివరాలు 

తీవ్ర ఆందోళనకు గురైన శిక్షణ పైలట్

పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో భూమిపై ఉన్న ప్రజలకు ఎలాంటి హాని జరగలేదు. విమానంలో ఉన్నవారికి కూడా గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. అయితే ఆకస్మిక అత్యవసర పరిస్థితి కారణంగా శిక్షణ పైలట్ తీవ్ర ఆందోళనకు గురైనట్లు సమాచారం. విమానం పొలంలో దిగిన విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు, పరిపాలనా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యకు గల అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

వివరాలు 

గతంలో కూడా విమాన ప్రమాదం

ఇదే గోజుబావి గ్రామ పరిసరాల్లో గతంలో కూడా విమాన ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా ఇంజిన్ పనిచేయకపోవడానికి దారితీసిన కారణాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలిసింది.

Advertisement