LOADING...
Mulapet Greenfield port: ఏప్రిల్‌లో ట్రయల్‌ రన్‌కు సిద్ధమవుతున్న మూలపేట పోర్టు
ఏప్రిల్‌లో ట్రయల్‌ రన్‌కు సిద్ధమవుతున్న మూలపేట పోర్టు

Mulapet Greenfield port: ఏప్రిల్‌లో ట్రయల్‌ రన్‌కు సిద్ధమవుతున్న మూలపేట పోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2026
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారనున్న శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. పోర్టు నిర్మాణంలో సుమారు 75 శాతం పనులు పూర్తైనట్లు సంబంధిత నిర్మాణ సంస్థ వెల్లడించింది. ముఖ్యమైన రెండు జనరల్‌ కార్గో బెర్తులతో పాటు నార్త్‌, సౌత్‌ బ్రేక్‌వాటర్ల పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏప్రిల్‌లో ట్రయల్‌ రన్‌ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నవంబరు నాటికి మిగిలిన పనులను పూర్తిచేసి పోర్టును వాణిజ్య కార్యకలాపాలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పోర్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెలా సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు.

వివరాలు 

పోర్టు నిర్మాణ స్వరూపం

మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టును తొలి దశలో 23.5 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో 1,500 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.4,361 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో పోర్టు అంతర్గత మౌలిక వసతుల కోసం రూ.2,981 కోట్లను కేటాయించగా, ఇప్పటివరకు రూ.1,887 కోట్ల మేర ఖర్చు చేశారు. మిగిలిన నిధులను భూసేకరణతో పాటు నిర్వాసితుల కాలనీల అభివృద్ధికి వినియోగిస్తున్నారు.

వివరాలు 

బ్రేక్‌వాటర్ల నిర్మాణం పూర్తి

అలల ఉద్ధృతిని తట్టుకునే విధంగా రూపొందించిన నార్త్‌, సౌత్‌ బ్రేక్‌వాటర్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ పనుల కోసం మొత్తం 32 లక్షల టన్నుల రాయిని వినియోగించారు. సౌత్‌ బ్రేక్‌వాటర్‌ 2,450 మీటర్ల పొడవున నిర్మించగా, అక్కడ వేవ్‌వాల్‌ పనులు కొనసాగుతున్నాయి. నార్త్‌ బ్రేక్‌వాటర్‌ 580 మీటర్ల పొడవున నిర్మించడంతో పాటు వేవ్‌వాల్‌ పనులు పూర్తయ్యాయి.

Advertisement

వివరాలు 

బెర్తుల నిర్మాణం తుది దశకు

పోర్టులో ఓడలు నిలిపేందుకు 270 మీటర్ల పొడవు, 34 మీటర్ల వెడల్పుతో మూడు జనరల్‌ కార్గో బెర్తులు నిర్మిస్తున్నారు. ఇందులో రెండు బెర్తుల పనులు పూర్తయ్యాయి. మూడో బెర్తును ఏప్రిల్‌ చివరినాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే 300 మీటర్ల పొడవు, 28 మీటర్ల వెడల్పుతో కోల్‌ బెర్తు నిర్మాణం కూడా సగానికి మించి పూర్తైంది. బెర్తుల వద్ద 15.5 మీటర్ల లోతుతో తవ్వకాలు చేయాల్సి ఉండగా, మొత్తం 15.85 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల మట్టిలో ఇప్పటికే 13.25 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల మేర తవ్వకాలు పూర్తి చేశారు. ప్రస్తుతం ఓడలు నిలిపేందుకు అనుకూలంగా పరిస్థితులు సిద్ధమయ్యాయి.

Advertisement

వివరాలు 

జోరుగా అనుసంధాన మౌలిక వసతుల పనులు 

పోర్టుకు అనుబంధంగా రహదారులు, రైల్వే లైన్లు, తాగునీటి సరఫరా, విద్యుత్తు వసతుల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. 16వ జాతీయ రహదారి నుంచి పోర్టుకు అనుసంధానంగా 12.85 కిలోమీటర్ల మేర మట్టి పనులు పూర్తయ్యాయి. చెన్నై-హావ్‌డా ప్రధాన రైల్వే లైన్‌లోని దండుగోపాలపురం హాల్టు నుంచి పోర్టుకు రైల్వే పట్టాల ఏర్పాటు కోసం 7.8 కిలోమీటర్ల మేర మట్టి పనులు పూర్తయ్యాయి. హిరమండలం గొట్టా బ్యారేజీ నుంచి పోర్టు వరకు 50 కిలోమీటర్ల పొడవున నీటి పైప్‌లైన్‌ పనులు కొనసాగుతున్నాయి. అలాగే టెక్కలి మండలం రావివలస సబ్‌స్టేషన్‌ నుంచి 132 కేవీ సామర్థ్యంతో విద్యుత్తు స్తంభాల ఏర్పాటు చేయాల్సి ఉంది.

వివరాలు 

పరిశ్రమలపై ఆశలు

మూలపేట పోర్టు నిర్మాణంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల ప్రజల్లో అభివృద్ధిపై పెద్దఎత్తున ఆశలు పెరిగాయి. పోర్టుకు అనుసంధానంగా భారీ పరిశ్రమలు ఏర్పాటైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టు పనులు వేగం పుంజుకోవడంతో పాటు పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం పోర్టు చుట్టుపక్కల సుమారు 10 వేల ఎకరాలను పారిశ్రామిక అవసరాల కోసం గుర్తించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మూలపేటను అధికారికంగా పారిశ్రామిక క్లస్టర్‌గా ప్రకటించడంతో అభివృద్ధి మరింత వేగం పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

Advertisement