TMC Candidate: ఫల్టా రీపోలింగ్‌కు ముందు పోటీ నుంచి వైదొలిగిన టీఎంసీ అభ్యర్థి
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లోని ఫల్టా నియోజకవర్గంలో రీపోలింగ్‌కు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 21న జరగనున్నరీ-పోలింగ్‌కు ముందు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. ఇకపై ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు. ఫల్టా ప్రాంత అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, ప్రజల శాంతి, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తాను ఈ నిర్ణయం తీసుకున్నానని జహంగీర్ ఖాన్ తెలిపారు. తన నియోజకవర్గంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేకుండా ప్రశాంత వాతావరణం కొనసాగాలని కోరుకుంటున్నానన్నారు.
వివరాలు
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీ కార్యాలయాలపై దాడులు
జహంగీర్ ఖాన్ నిర్ణయంపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ఆయన పోటీ నుంచి తప్పుకోవడం పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, దీనికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఫల్టా ప్రాంతంలో తమ పార్టీకి చెందిన వంద మందికి పైగా కార్యకర్తలను అరెస్టు చేశారని ఆరోపించింది. అంతేకాకుండా పార్టీ కార్యాలయాలపై దాడులు చేసి ధ్వంసం చేశారని పేర్కొంది. ఈ ఘటనలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎన్నికల సంఘం స్పందించలేదని తృణమూల్ కాంగ్రెస్ విమర్శించింది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొందరు నాయకులు క్షేత్రస్థాయి రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ తమ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేసింది.
వివరాలు
మే 21న పోలింగ్
ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని 293 నియోజకవర్గాలకు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఫల్టా నియోజకవర్గంలో ఈవీఎంలలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో పాటు, సీసీటీవీ దృశ్యాలు అందుబాటులో లేకపోవడం, ఓటర్లను బెదిరించిన ఘటనలు వెలుగులోకి రావడంతో ఎన్నికల సంఘం అక్కడి పోలింగ్‌ను రద్దు చేసింది. అనంతరం మే 21న తిరిగి పోలింగ్ నిర్వహించాలని ప్రకటించింది.