
Tripura: 6 రోజుల కిందట అదృశ్యమైన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని.. యమునా నదిలో మృతదేహం గుర్తింపు!
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో త్రిపురకు చెందిన 19ఏళ్ల యువతి స్నేహ దేబ్‌నాథ్ అదృశ్యం మిస్టరీగా మారింది. ఎట్టకేలకు ఆరు రోజుల అనంతరం ఆమె మృతదేహం గుర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ పోలీసుల ప్రకారం,స్నేహ మృతదేహాన్ని ఫ్లైఓవర్ కింద కనుగొని,పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. స్నేహ,ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని ఆత్మ రామ్ సనాతన్ ధర్మ కళాశాలలో చదువుతుండగా, జులై 7న ఆమెలో ఇంటి వారితో చివరిసారిగా ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఉదయం 5:56గంటలకు తన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన స్నేహ,తన స్నేహితురాలు పిటునియాతో కలిసి సరాయ్ రోహిల్లా రైల్వే స్టేషన్‌కి వెళ్తున్నట్లు చెప్పింది. అయితే ఆరోజు పిటునియాను ఆమె కలవకపోవడం,ఫోన్ కూడా ఉదయం 8:45 నుంచి స్విచ్ఛ్‌ఆఫ్‌లోకి వెళ్లిపోవడం గమనార్హం.
వివరాలు
లేఖపై అనుమానం వ్యక్తం చేసిన సోదరి బిపాషా దేబ్‌నాథ్
జులై 13న ఆమె గదిలో ఒక చేతిరాత లేఖ లభించింది. అందులో "నేను విఫలమైన అనుభూతిలో ఉన్నాను. నా జీవితం అసహనంగా మారింది" అనే భావాలు వ్యక్తమయ్యాయి. అయితే స్నేహ సోదరి బిపాషా దేబ్‌నాథ్ ఈ లేఖపై అనుమానం వ్యక్తం చేస్తూ, దీనిలో స్పష్టత లేదని వ్యాఖ్యానించింది. ఇక చివరిసారిగా ఒక క్యాబ్ డ్రైవర్ స్నేహను ఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జ్ సమీపంలో దింపినట్లు నిర్ధారించాడు. దీన్ని ఆధారంగా తీసుకుని ఢిల్లీ పోలీసులు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్), త్రిపుర పోలీసులు కలిసి, సిగ్నేచర్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాల్లో - యమునా నది గట్టులపై - సుమారు 7 కిలోమీటర్ల వ్యాసార్థంలో గాలింపు చర్యలు చేపట్టారు.
వివరాలు
బ్రిడ్జ్ కింద స్నేహ మృతదేహం
అయితే ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేని కారణంగా గాలింపు ప్రక్రియకు అవరోధాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ అధికారులు విరమించకుండా ప్రయత్నాలు కొనసాగించి, చివరకు ఆదివారం సాయంత్రం స్నేహ మృతదేహాన్ని బ్రిడ్జ్ కింద కనుగొన్నారు. మృతదేహాన్ని అప్పటికప్పుడు పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు, ఇది ఆత్మహత్యగా భావించాలా? లేదా ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.
వివరాలు
స్నేహ మిస్సింగ్ పై రంగం లోకి దిగిన త్రిపుర సీఎం
ఈ ఘటనపై త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా స్వయంగా స్పందించారు. స్నేహ మిస్సింగ్ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం కూడా ఈ విషయంలో మద్దతుగా ముందుకొచ్చింది. స్నేహ తండ్రి, ఒక రిటైర్డ్ సుబేదార్ మేజర్, ప్రస్తుతం డయాలసిస్‌లో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులు అదృశ్యం ఫిర్యాదు ఆలస్యంగా నమోదు కావడం, అలాగే పోలీసులు సమయానికి స్పందించకపోవడం వల్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విచారకర ఘటనపై సమగ్ర విచారణ జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు.