LOADING...
Rubio: భారత్‌పై ట్రంప్ వ్యాఖ్యలపై రూబియోకు ప్రశ్న.. చాకచక్యంగా సమాధానమిచ్చిన అమెరికా మంత్రి
చాకచక్యంగా సమాధానమిచ్చిన అమెరికా మంత్రి

Rubio: భారత్‌పై ట్రంప్ వ్యాఖ్యలపై రూబియోకు ప్రశ్న.. చాకచక్యంగా సమాధానమిచ్చిన అమెరికా మంత్రి

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2026
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో కలిసి పాల్గొన్న ఈ సమావేశంలో ఓ అమెరికన్ పాత్రికేయుడు భారతీయులపై సామాజిక మాధ్యమాల్లో పెరుగుతున్న జాత్యహంకార వ్యాఖ్యల గురించి ప్రశ్నించాడు. ఇదే సమయంలో గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కూడా ప్రస్తావించగా.. రూబియో సమర్థంగా స్పందించారు. ట్రంప్‌కు భారత్‌పై ప్రత్యేకమైన అభిమానం ఉందని రూబియో స్పష్టం చేశారు.

వివరాలు 

జాత్యహంకార వ్యాఖ్యలపై స్పందించిన రూబియో

''ట్రంప్ భారత్‌ను అవమానించేలా మాట్లాడలేదని నేను నమ్ముతున్నాను. ఆయనకు భారతదేశం అంటే ఎంతో గౌరవం, అభిమానముంది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీపై, భారత్‌పై తన అభిప్రాయాన్ని ఎంతో సానుకూలంగా వెల్లడించారు. ట్రంప్‌కు భారత్‌పై ఇష్టం లేకపోతే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. అలాగే తనకు అత్యంత సన్నిహితుడైన సెర్గియో గోర్‌ను భారత్‌కు రాయబారిగా నియమించేవారు కాదు'' అని వివరించారు. భారతీయులపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న జాత్యహంకార వ్యాఖ్యలపై కూడా రూబియో స్పందించారు.

వివరాలు 

మా దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన భారతీయులు

''ప్రతి దేశంలోనూ బాధ్యతారహితంగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు. అమెరికాలో కూడా అలాంటి వారు ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా ఏదైనా వ్యాఖ్యానించగలరు. అలాంటి వ్యాఖ్యలను అతిగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి అమెరికాకు వచ్చిన భారతీయులు మా దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. వారి ప్రతిభ, కృషిని మేము ఎప్పుడూ గౌరవిస్తాం'' అని పేర్కొన్నారు.

Advertisement

వివరాలు 

భారత విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం

ఈ వివాదానికి కారణమైన సంఘటన గత ఏప్రిల్‌లో చోటుచేసుకుంది. ఓ పాడ్‌కాస్ట్ నిర్వాహకుడు భారత్‌ను అవమానించేలా చేసిన వ్యాఖ్యలను ట్రంప్ తన సామాజిక మాధ్యమ ఖాతాలో పంచుకున్నారు. దీనిపై అప్పట్లో భారత విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించకుండా స్పందించిన విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్.. ''ఇలాంటి వ్యాఖ్యలు భారత్-అమెరికా మధ్య ఉన్న పరస్పర గౌరవానికి, ద్వైపాక్షిక సంబంధాల వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేవు'' అని స్పష్టం చేశారు.

Advertisement