
Parliament Monsoon Session: ట్రంప్ వ్యాఖ్యలు దేశానికి అవమానకరం.. ఖర్గే ప్రశ్నకు నడ్డా సమాధానం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన వెంటనే ఉగ్రవాద దాడులు, ఆపరేషన్ సిందూర్ అంశాలపై చర్చలు మొదలయ్యాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనలపై చర్చించాలంటూ ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్, రాజ్యసభలో గట్టిగ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సభలు పలు సార్లు వాయిదా పడ్డాయి. ఈ సందర్భంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు గమనించాల్సినవని పేర్కొన్నారు. దేశంపై ఉగ్రదాడులు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి రాజీకీయ షరతులు పెట్టకుండా ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇచ్చిందని చెప్పారు.
Details
ఉగ్రవాదులను పట్టుకోలేకపోయారు
సైన్యం ధైర్య సాహసాలను మెచ్చుకొని మానసికంగా బలపడేందుకు అండగా నిలిచామని వివరించారు. పహల్గామ్ దాడి ఏప్రిల్ 22న జరిగిందని, కానీ ఇప్పటికీ దానికి బాధ్యులైన ఉగ్రవాదులను పట్టుకోలేకపోయారని విమర్శించారు. ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ దాడుల నేపథ్యంలో మీరు ప్రపంచానికి చెప్పిన విషయాలే నేను ప్రస్తావిస్తున్నానని అన్నారు. ఈ దాడుల నేపథ్యంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ చేసిన "నిఘా వైఫల్యం" వ్యాఖ్యలపై స్పందించాలన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నా వల్లే కాల్పుల విరమణ జరిగిందని అన్నారు. ఇది దేశానికి అవమానకరమని ఖర్గే పేర్కొన్నారు.
Details
అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం
ట్రంప్ అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ప్రభుత్వం వాటిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందనగా రాజ్యసభలో సభా నాయకుడు జేపీ నడ్డా మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి ప్రతి అంశాన్ని ప్రపంచం ముందుంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. స్వాతంత్య్రం తర్వాత మోదీ నేతృత్వంలో జరిగిన ఆపరేషన్ లాంటి సంఘటన దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు. భారత్ ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.