Loading...
Michael Boulos: భారత పర్యటనలో ట్రంప్‌ చిన్నల్లుడు.. కొచ్చికి చేరుకున్న మైఖెల్ బౌలోస్
భారత పర్యటనలో ట్రంప్‌ చిన్నల్లుడు.. కొచ్చికి చేరుకున్న మైఖెల్ బౌలోస్

Michael Boulos: భారత పర్యటనలో ట్రంప్‌ చిన్నల్లుడు.. కొచ్చికి చేరుకున్న మైఖెల్ బౌలోస్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 08, 2026
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న అల్లుడు మైఖెల్ బౌలోస్ భారత్‌లో పర్యటిస్తున్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా శనివారం ఆయన కేరళలోని కొచ్చికి చేరుకున్నారు. ఆయన వెంట భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. మైఖెల్ బౌలోస్‌ కేరళలోని అలప్పుళ ప్రాంతంలో పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు. ఇదిలా ఉంటే.. కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్‌తో మైఖెల్ బౌలోస్‌ చర్చలు జరిపినట్లు కొన్ని వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ కథనాలను సీఎం కార్యాలయం ఖండించింది.

వివరాలు

ఈ ఏడాది మే నెలలోనూ భారత్‌లో పర్యటించిన మైఖెల్ బౌలోస్

ముఖ్యమంత్రి సతీశన్‌ కేవలం అమెరికా రాయబారి సెర్గియో గోర్‌తోనే చర్చలు జరిపారని.. ఆ సమావేశంలో ట్రంప్ అల్లుడు మైఖెల్ బౌలోస్ పాల్గొనలేదని స్పష్టం చేసింది.

మైఖెల్ బౌలోస్‌ భారత్ పర్యటనపై అమెరికా రాయబార కార్యాలయం కూడా స్పందించింది. మైఖెల్‌కు అమెరికా రాయబారి సెర్గియో గోర్‌తో దశాబ్ద కాలంగా మంచి స్నేహబంధం ఉందని తెలిపింది.

తన పాత స్నేహితుడు సెర్గియో గోర్‌ను కలిసేందుకే మైఖెల్ ఈ ఏడాది రెండోసారి భారత్‌కు వచ్చినట్లు వెల్లడించింది.

కాగా.. ఈ ఏడాది మే నెలలోనూ మైఖెల్ బౌలోస్ భారత్‌లో పర్యటించారు. అప్పుడు ఆయన తన భార్య, డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీతో కలిసి భారత్‌కు వచ్చారు. తాజాగా మరోసారి వ్యక్తిగత పర్యటనలో భాగంగా భారత్‌కు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT