
Amit Shah: కొత్త జీఎస్టీ ని నమ్మకంపై ఆధారపడిన పన్నుల వ్యవస్థగా అభివర్ణించిన అమిత్ షా
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో కీలకమైన మార్పులు నేటి నుంచి అమలు కానున్నాయి. 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టిన తరువాత చేసిన అతిపెద్ద సంస్కరణలలో భాగంగా, పలు వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనుంది. ఈ మార్పులు దేశ ప్రజలు,ప్రభుత్వం మధ్య విశ్వాసపూర్వక సంబంధాన్ని సృష్టించే కొత్త యుగాన్ని ప్రారంభిస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కొత్త జీఎస్టీ విధానం ప్రకారం,ఇప్పటి 5%, 12%, 18%, 28% శ్లాబుల స్థానంలో కేవలం 5% , 18% అనే రెండు ప్రధాన శ్లాబులు మాత్రమే ఉంటాయి. దీని కారణంగా నిత్యావసరాలు,ఆహార పదార్థాలు,ఆరోగ్య బీమా,విద్యుత్,సిమెంట్,కారు,ట్రక్,ట్రాక్టర్, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి అనేక ఉత్పత్తులు చౌకగా లభించనున్నాయి.
వివరాలు
జీఎస్టీ మార్పులు 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాన్ని ముందుకు నడిపే కీలక అడుగు
అత్యంత విలాసవంతమైన వస్తువులపై 40% పన్ను వర్తించనుండగా, పొగాకు ఉత్పత్తులు పాత 28% ప్లస్ సెస్ శ్రేణిలోనే కొనసాగుతాయి. ఈ సంస్కరణల గురించి అమిత్ షా మాట్లాడుతూ, "ఈ కొత్త విధానం దేశంలో నమ్మకంపై ఆధారపడిన పన్ను వ్యవస్థకు పునాదులను వేస్తుంది. పన్నులు కేవలం ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి వసూలు చేస్తారనే అభిప్రాయాన్ని తొలగిస్తుంది. పన్నులు దేశం అభివృద్ధి కోసం మాత్రమే వసూలు చేయబడతాయని 130 కోట్ల ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తుంది" అని తెలిపారు. ఈ నిర్ణయం ఉత్పత్తి, వినియోగం రెండింటినీ దేశంలో పెంచుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ జీఎస్టీ మార్పులను 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాన్ని ముందుకు నడిపే కీలక అడుగుగా వివరించారు.
వివరాలు
ప్రతిపక్షాలపై విమర్శలు చేసిన అమిత్ షా
నవరాత్రుల ప్రారంభంలో దేశంలో 'జీఎస్టీ పొదుపు పండుగ' ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. పేదలు, మధ్యతరగతి వర్గం, యువత, మహిళలు, వ్యాపారులు ఈ మార్పుల నుంచి ప్రత్యేక ప్రయోజనం పొందుతారని ఆయన పేర్కొన్నారు. అమిత్ షా ప్రతిపక్షాలపై కూడా విమర్శలు చేశారు. "కొన్ని రాజకీయ నాయకులు జీఎస్టీని అపఖ్యాతి పాలు చేశారు. జీఎస్టీ విజయమంతమవ్వడం చూసి, అది సాధ్యమేనని అంగీకరించలేక, ఆ ఆలోచన మాదేనంటూ ముందుకు వచ్చారు. పదేళ్ల పాలనలో వారు ఎందుకు అమలు చేయలేకపోయారు?" అని ప్రశ్నించారు. ఆయన చెప్పినట్లు, కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రాలు రాజ్యాంగ హామీ కోరినప్పటికీ అది ఇవ్వలేకపోయాయి, కానీ మోదీ ప్రభుత్వం ఆ హామీని ఇస్తూ రాష్ట్రాల నమ్మకాన్ని పొందడంతో జీఎస్టీ విజయవంతమైందని షా స్పష్టంగా తెలిపారు.