
TTD: ముగిసిన టీటీడీ పాలక మండలి సమావేశం.. సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
ఒంటిమిట్ట రామాలయంలో పూర్తిస్థాయి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు రూ.4.35 కోట్ల నిధులను కేటాయించినట్టు తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. ఆగస్టు నెల నుంచి రోజుకు మూడుసార్లు భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో తితిదే పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను బీఆర్ నాయుడు, తితిదే ఈవో శ్యామలరావు మీడియాకు వివరించారు. తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 నిర్మాణానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని నిర్ణయించినట్టు బీఆర్ నాయుడు వెల్లడించారు. అలాగే, తిరుమలలోని అన్ని కార్యాలయాలు ఒకేచోట ఏర్పాటు అయ్యేలా పరిపాలనా భవన నిర్మాణానికి కూడా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
వివరాలు
142 మంది కాంట్రాక్ట్ డ్రైవర్ల క్రమబద్ధీకరణ
తిరుమలకు వచ్చే సామాన్యభక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తితిదే ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. భక్తులు ఎక్కువసేపు ఎదురుచూడకుండా దర్శనఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. అలిపిరి,శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. శిలాతోరణం,చక్రతీర్థం ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ఆర్కిటెక్చరల్ కన్సల్టెన్సీ నియామకంపై చర్చించినట్టు చెప్పారు. వసతిగదుల కోసం వేచి ఉండే భక్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టనున్నామని వివరించారు. తితిదే ఆధ్వర్యంలో ఆలయాల విస్తరణపై కూడా యోచిస్తున్నామని పేర్కొన్నారు. శ్రీవారిసేవలో అనేక సంస్కరణలను తీసుకువస్తున్నామని చెప్పారు.భక్తులకు డిజిటల్,సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలపై చర్చించామన్నారు. తితిదేలో పనిచేస్తున్న 142మంది కాంట్రాక్ట్ డ్రైవర్లను క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఆమోదానికి పంపేందుకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
వివరాలు
700 మందికి వేద పారాయణదారులుగా ఉద్యోగ అవకాశాలు
తిరుమలలో భక్తులు వేచి ఉండేందుకు అనువైన శాశ్వత నిర్మాణాల కోసం కన్సల్టెన్సీ నియామకానికి చర్యలు చేపడతామని ఈవో తెలిపారు. కొత్తగా 700 మందికి వేద పారాయణదారులుగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. దేవాదాయశాఖ సిఫార్సు మేరకు 600 మందికి నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున అందించనున్నట్టు వివరించారు. ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన ప్రాంతాల్లో మూడు కేటగిరీల్లో భజన మందిరాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ నిధులను విడుదల చేయనున్నట్లు చెప్పారు. కడపలో ఉన్న వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయం అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేయనున్నట్టు తెలిపారు.
వివరాలు
320 కొత్త ఆలయాలకు రూ.79.82 లక్షల విలువైన మైక్ సెట్లు
సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించబడిన 320 కొత్త ఆలయాలకు రూ.79.82 లక్షల విలువైన మైక్ సెట్లను ఉచితంగా అందించేందుకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఒక్కో మైక్ సెటు ఖర్చు రూ.25 వేలు ఉంటుందని తితిదే ఈవో శ్యామలరావు తెలిపారు.