Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. హుండీలో నాణేలకు గుడ్‌బై? టీటీడీ కీలక ఆలోచన
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న తిరుమల వెంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వామివారి దర్శనం కోసం ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. దర్శనం అనంతరం వారు తమ మొక్కులను తీర్చుకుంటూ, హుండీ ద్వారా కానుకలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. చాలామంది భక్తులు మొక్కు నిమిత్తం చిల్లర నాణేలను హుండీలో వేస్తుంటారు. అయితే ఇకపై నాణేల స్థానంలో "ముడుపు పత్రాలు" అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలనే ఆలోచన టీటీడీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ రోజు జరగనున్న పాలకమండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే, భక్తులు నాణేల బదులుగా ముడుపు పత్రాలను తీసుకుని తిరుమలలోని శ్రీవారి హుండీలో నేరుగా సమర్పించవచ్చు.
వివరాలు
రూ.100 నుంచి రూ.1 లక్ష వరకు వివిధ మొత్తాల్లో పత్రాలు
తిరుపతి,తిరుమల ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఈ ముడుపు పత్రాలను జారీ చేసేలా ఏర్పాట్లు చేయాలని యోచిస్తున్నారు. భక్తులు నాణేలు తీసుకురావాల్సిన అవసరం లేకుండా, ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం లేదా నెఫ్ట్ వంటి డిజిటల్ చెల్లింపు మార్గాల ద్వారా విరాళం పంపితే, ఆ మొత్తానికి సమానమైన ముడుపు పత్రాలు ఇవ్వబడతాయి. ఆ పత్రాలను తీసుకుని భక్తులు హుండీలో వేయగలరు. ఈ విధానం అమలు అయితే భారీ మొత్తంలో నాణేలు, నగదు మోసుకురావాల్సిన ఇబ్బంది తగ్గి, భక్తులకు సౌలభ్యం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. రూ.100 నుంచి రూ.1 లక్ష వరకు వివిధ మొత్తాల్లో ఈ పత్రాలను అందుబాటులో ఉంచాలని ప్రణాళిక సిద్ధమవుతోంది.
వివరాలు
పత్రం కొనుగోలు చేసిన వెంటనే ఆ మొత్తం శ్రీవారి ఖాతాలో జమ అయినట్లే..
పత్రం కొనుగోలు చేసిన వెంటనే ఆ మొత్తం శ్రీవారి ఖాతాలో జమ అయినట్లే పరిగణిస్తారు. అయితే హుండీలో స్వయంగా మొక్కు సమర్పించాలనే భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని,ఈ పత్రాలను హుండీలో వేయే విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది. ఇదొక్కటే కాదు,మరొక కీలక నిర్ణయంపై కూడా టీటీడీ చర్చించనున్నట్టు సమాచారం. తిరుమలలోని మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు, దాతలు శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ద్వారా విరాళాలు అందిస్తున్నారు. ఒకరోజు మొత్తం అన్నప్రసాద వితరణ ఖర్చు రూ.44 లక్షలుగా నిర్ణయించబడింది. ఇందులో ఉదయం అల్పాహారానికి రూ.10 లక్షలు,మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు, రాత్రి భోజనానికి మరో రూ.17 లక్షలు వ్యయమవుతాయి.
వివరాలు
భక్తుల పేరుతో అన్నదానం
కొందరు దాతలు ఈ మూడు విభాగాల్లో ఏదో ఒక భాగానికి సంబంధించిన మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నారు. అయితే ఇంత భారీ మొత్తాన్ని అందించలేని భక్తుల కోసం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని టీటీడీ యోచిస్తోంది. పదిమంది లేదా వందమంది భక్తులకు సరిపడే అన్నదానానికి అవసరమైన మొత్తాన్ని విరాళంగా అందించే అవకాశం కల్పించి, ఆ భక్తుల పేరుతో అన్నదానం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. అదనంగా, టీటీడీ లడ్డూ కౌంటర్ల వద్ద జూట్ బ్యాగులను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది.