తిరుమల: నడక మార్గంలో భద్రతా ఏర్పాట్లను పెంచిన టీటీడీ
తిరుమల నడక మార్గంలో చిన్నారి లక్షితపై చిరుత దాడిచేసిన సంగతి తెలిసిందే. అలిపిరి మెట్ల మార్గంలో ఈ ఘటన జరగడంతో ప్రస్తుతం టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తోంది. చిరుత సంచరించే ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుతను పట్టుకునేందుకు ప్రత్యేక బోనులను టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఏర్పాటు చేసింది. సంఘటనా స్థలాన్ని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సందర్శించారు. వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో భద్రతా చర్యలపై ప్రత్యేకంగా మాట్లాడారు.
టీటీడీ సూచనలు పాటించాలని విజ్ఞప్తి
చిన్నారిపై చిరుత దాడి నేపథ్యంలో భక్తులందరూ గుంపుగా వెళ్ళాలని టీటీడీ సూచిస్తోంది. రాత్రివేళలో చిన్నారులను దూరంగా వదిలిపెట్టకుండా తమతోనే ఉంచుకోవాలని టీటీడీ చెబుతోంది. తిరుమల మెట్ల మార్గంలో 7వ మైలు నుంచి నరసింహ స్వామి ఆలయం వరకు ప్రత్యేక భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసారు. ఈ ప్రాంతం, భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని హై అలెర్ట్ జోన్ గా ప్రకటించారు. గతంలో తిరుమల నడక మార్గంలో బాలుడిపై చిరుత దాడి చేసింది. ఇప్పుడు కూడా అదే ప్రాంతంలో చిన్నారి లక్షితపై దాడి చేసింది.