Tirumala: తిరుమలలో మరో కుంభకోణం.. పట్టు శాలువాల పేరుతో పాలిస్టర్ దందా
ఈ వార్తాకథనం ఏంటి
కలియుగంలో విశ్వాసానికి ప్రతీకగా భావించే తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి వరుసగా వెలుగుచూస్తున్న కుంభకోణాలు భక్తుల్లో గాఢమైన ఆందోళనను నెలకొల్పుతున్నాయి. పరకామణి దొంగతనాలు, కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారాలు మరచిపోక ముందే, ఇప్పుడు శ్రీవారికి సమర్పించే పట్టు శాలువాల కొనుగోళ్లలో భారీ మోసం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. విరాళాలు సమర్పించే దాతలు, అలాగే వీఐపీలకు అందజేయాల్సిన స్వచ్ఛమైన మల్బరీ పట్టు శాలువాల బదులుగా, సుమారు పదేళ్ల పాటు పూర్తిగా పాలిస్టర్‌తో తయారైన శాలువాలను సరఫరా చేశారని టీటీడీ విజిలెన్స్ తనిఖీల్లో బయటపడింది. వివరాల్లోకి వెళితే.. తిరుమల దర్శనానికి వచ్చే దాతలు,వీఐపీలకు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం నిర్వహించి,పట్టు శాలువాతో గౌరవించడం ఆలయ సంప్రదాయంగా కొనసాగుతోంది.
వివరాలు
సరఫరా అయిన శాలువాలు పూర్తిగా పాలిస్టర్‌తో తయారయ్యాయి
ఈ అవకాశాల కోసం టీటీడీ ప్రతీ ఏడాది కోట్లాది రూపాయలను వ్యయపరిచి శాలువాలను కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యంలో, తిరుమలకు చెందిన వీఆర్‌ఎస్ ఎక్స్‌పోర్ట్ అనే సంస్థ 2015 నుంచి టెండర్ గెలుచుకుని వరుసగా శాలువాల సరఫరా బాధ్యతలు నిర్వహిస్తోంది. అయితే, టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాల మేరకు ఇటీవల విజిలెన్స్ అధికారులు అకస్మాత్తుగా శాలువాల నాణ్యతపై తనిఖీలు చేపట్టారు. టెండర్ నిబంధనలలో పేర్కొన్న ప్రకారం, స్వచ్ఛమైన మల్బరీ పట్టుతోనే, నిర్దిష్ట బరువు, పరిమాణ ప్రమాణాల ప్రకారం శాలువాలు తయారు చేయాలి. వాటిపై 'ఓం నమో వేంకటేశాయ' అనే మంత్రాక్షరాలు,శంకు-చక్ర చిహ్నాలు ఉండాలి. కానీ విచారణలో,సరఫరా అయిన శాలువాలు పూర్తిగా పాలిస్టర్‌తో తయారయ్యాయని వెల్లడైంది.
వివరాలు
కుంభకోణంపై ఏసీబీ విచారణకు టీటీడీ తీర్మానం
మార్కెట్‌లో కేవలం రూ.350 నుంచి రూ.400 మాత్రమే విలువ చేసే ఈ నాసిరకం వస్త్రాలను ఒక్కో దానిని రూ.1,389గా టీటీడీకి విక్రయించి, సంస్థ భారీ మోసానికి పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు. సంప్రదాయ పరీక్షల భాగంగా ఈ శాలువాల నమూనాలను బెంగళూరు, ధర్మవరంలోని సెంట్రల్ సిల్క్ బోర్డ్ ల్యాబ్‌లకు పంపించగా, అవి పూర్తిగా పాలిస్టర్ పదార్థంతో తయారైనవేనని నివేదికల్లో స్పష్టం అయింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు టీటీడీ పాలకమండలి తీర్మానం చేసి, నిందితులపై కఠినమైన క్రిమినల్ చర్యలు చేపట్టాలని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌ను కోరింది. గతంలో కాంచీపురంలోని ల్యాబ్‌లో నమూనాలు పరీక్షించిన సమయంలో వాటిని మార్పిడి చేసి ఉండవచ్చని అధికార వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.