TTD : టీటీడీ బోర్డు సంచలన నిర్ణయాలు.. అర్హులను రెగ్యులరైజ్ చేస్తామన్న మండలి
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మరోసారి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు అర్హత గల కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని తీర్మానించింది. శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని అలిపిరి వద్ద ఈనెల 23 నుంచి ప్రారంభిస్తున్నామని బోర్డు వెల్లడించింది. అయితే, హోమంలో పాల్గొనే భక్తులు రూ.1000 చెల్లించి టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుందని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జరిగిన పాలకమండలి సమావేశం నేపథ్యంలో టీటీడీ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయాలన్న ప్రభుత్వ జీఓ నెం.114 మేరకు అర్హత ఉన్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్నారు.
ప్రసాదాలు, ముడి సరుకులు నిల్వ కోసం రూ. 11 కోట్ల కేటాయింపు
ప్రతి ఒక్క ఉద్యోగికి ఇంటి స్థలాలు కేటాయిస్తామని, ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించిన వడమాలపేట వద్ద గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి రూ. 25.67 కోట్లు కేటాయించామన్నారు. వీటిని తిరిగి ఉద్యోగులు నుంచి రీఎంబర్స్ చేసుకుంటామన్నారు. తిరుపతిలోని రాంనగర్ క్వార్టర్స్ అభివృద్ధి పనులకు 6.15 కోట్లు కేటాేయించామన్నారు. ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా 14 వేలు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ. 6,850 చెల్లిస్తామని భూమన వివరించారు. రూ. 197 కోట్లతో స్విమ్స్ ఆస్పత్రి ఆధునీకరణ పనులకు ఆమోదం తెలిపామన్నారు. ప్రసాదాలు, ముడి సరుకులు నిల్వ కోసం రూ. 11 కోట్లతో అలిపిరి వద్ద గోడౌన్లు నిర్మిస్తున్నామన్నారు.
వకులామాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణం కోసం రూ.21 కోట్లు ఖర్చు
మంగళం నుంచి రేణిగుంట వరకు రోడ్డు అభివృద్ది పనులుకు 15 కోట్లు, ఎంఆర్ పల్లి జంక్షన్ నుంచి అన్నమయ్య వరకు రూ. 4.5 కోట్లు, పుదిపట్ల జంక్షన్ నుంచి వకులామాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణం కోసం రూ. 21 కోట్లు కేటాయించామన్నారు. ఆయుర్వేద ఆస్పత్రి కోసం రూ.1.65 కోట్లతో కొత్త భవన నిర్మాణం, ఇదే సమయంలో రుయాలో టీబీ రోగుల సౌకర్యార్థం రూ.1.79 కోట్లతో కొత్త వార్డు నిర్మాణం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చామన్నారు. స్విమ్స్ ఆస్పత్రికి సంబంధించి రూ.3.35 కోట్లతో నూతన భవనాలు నిర్మాణం చేస్తామన్నారు. కొత్తగా కార్డియో, న్యూరో బ్లాక్ ల ఏర్పాటు కోసం రూ. 74 కోట్లు కేటాయించినట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.