Tirumala: పచ్చదనంతో కళకళలాడుతున్న తిరుమల కొండలు.. శేషాచల కొండల్లో 89.40 శాతం పచ్చదనం
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమల అంటే భక్తుల మనసులో ముందుగా మెదిలేది శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యరూపమే. ఆ తరువాత గుర్తుకొచ్చేది శేషాచలం కొండల ఆహ్లాదకరమైన పచ్చదనం. ప్రస్తుతం ఆ పవిత్ర గిరులు మరింత సస్యశ్యామలంగా మారాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ విభాగం ఎన్నో ఏళ్లుగా చేపడుతున్న పరిరక్షణ చర్యల ఫలితంగా శేషాచల అటవీ విస్తీర్ణం 89.40 శాతానికి పెరిగింది. ఇటీవల వెలువడిన భారత అటవీ స్థితిగతుల నివేదిక ప్రకారం అటవీ సంరక్షణలో టీటీడీ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. టీటీడీ ఆధీనంలోని 2,719 హెక్టార్ల అటవీ ప్రాంతంలో సుమారు 2,431 హెక్టార్లు పచ్చని చెట్లతో నిండిపోయాయి.
వివరాలు
నాలుగు అటవీ విభాగాల ద్వారా పర్యవేక్షణ
శేషాచల అరణ్య సంపదను కాపాడటంతో పాటు పర్యావరణ సమతుల్యతను పరిరక్షించేందుకు టీటీడీ అటవీ విభాగం 1980 నుంచే ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అటవీ అధికారుల పర్యవేక్షణలో తిరుమల, తిరుపతిలలో నాలుగు అటవీ విభాగాల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోంది. అడవుల్లో అక్రమంగా కలప తరలింపు, వన్యప్రాణుల వేట వంటి కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక గస్తీ బృందాలు ఇరవై నాలుగు గంటలూ అప్రమత్తంగా పనిచేస్తున్నాయి. అటవీ అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రతి సంవత్సరం 26.5 లక్షల చదరపు మీటర్ల మేర అగ్ని నిరోధక మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు.
వివరాలు
జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు కూడా టీటీడీ పలు కార్యక్రమాలు
జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు కూడా టీటీడీ పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. పర్యావరణానికి హాని కలిగించే విదేశీ అకేషియా చెట్లను తొలగించి, వాటి స్థానంలో గంధం, ఎర్రచందనం, ఉసిరి, నేరేడు వంటి స్థానిక జాతి మొక్కలను నాటుతున్నారు. మొత్తం 576 హెక్టార్లలో ఈ కార్యక్రమాన్ని చేపట్టగా, ఇప్పటికే 22 హెక్టార్లలో పనులు పూర్తయ్యాయి. ఇందుకు అవసరమైన మొక్కలను టీటీడీ నర్సరీలలోనే పెంచుతున్నారు.
వివరాలు
శేషాచల పచ్చదనాన్ని మరింత విస్తరించేందుకు టీటీడీ కృషి
వన్యప్రాణుల సంరక్షణకు కూడా దేవస్థానం ప్రాధాన్యత ఇస్తోంది. వేసవి కాలంలో అడవి జంతువుల కోసం నీటి గుంతలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల రక్షణ కోసం పాములను పట్టుకునే ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచుతున్నారు. ఆలయ అవసరాలకు కావాల్సిన గంధం, వంటచెరకు, దర్భ వంటి సామగ్రిని సమకూర్చడమే కాకుండా తిరుమల, తిరుపతిలోని రహదారి మధ్యభాగాలు, ఉద్యానవనాల సంరక్షణ బాధ్యతలను కూడా అటవీ విభాగమే నిర్వహిస్తోంది. పవిత్ర వనం, దివ్య ఔషధ వనం వంటి పలు కార్యక్రమాలతో శేషాచల పచ్చదనాన్ని మరింత విస్తరించేందుకు టీటీడీ కృషి కొనసాగిస్తోంది.