vijay: రూ.404 కోట్ల ఆస్తులతో రాజకీయాల్లోకి విజయ్ ఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు రాజకీయాల్లో తొలిసారి అడుగుపెడుతున్న టీవీకే నాయకుడు విజయ్ జోసెఫ్ తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడించారు. పెరంబూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ సమర్పించిన సందర్భంగా ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో ఈ వివరాలను నమోదు చేశారు. ఆయన వద్ద మొత్తం రూ.404.58 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. బ్యాంక్ డిపాజిట్లు, స్థిరాస్తులు, వాహనాల వంటి అన్ని అంశాలను ఇందులో వివరించారు. నగదు రూపంలో తన వద్ద రూ.2 లక్షలు ఉండగా, తన భార్య సంగీత వద్ద రూ.1 లక్ష ఉన్నట్లు పేర్కొన్నారు. వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో మొత్తం రూ.213 కోట్ల నిధులు ఉన్నాయని తెలిపారు.
వివరాలు
రూ.120 కోట్ల విలువైన బంగారం..
తన వాహనాల వివరాల్లో బీఎండబ్ల్యూ 530, బీఎండబ్ల్యూ i7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్‌ఫైర్ వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయని చెప్పారు. అలాగే మారుతీ సుజుకీ స్విఫ్ట్, టీవీఎస్ ఎక్స్‌ఎల్ సూపర్ కూడా తన వద్ద ఉన్నట్లు వెల్లడించారు. మొత్తం వాహనాల విలువ రూ.14.35 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన వద్ద 883 గ్రాముల బంగారం ఉందని, దాని విలువ సుమారు రూ.1.20 కోట్లు ఉంటుందని తెలిపారు. అదనంగా రూ.15 లక్షల విలువైన వెండి వస్తువులు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఇవి తప్ప మరోగా రూ.198 కోట్ల విలువైన స్థిరాస్తులు తన పేరిట ఉన్నాయని పేర్కొన్నారు. ఈ స్థిరాస్తుల్లో కొన్నింటిని స్వయంగా కొనుగోలు చేయగా, మరికొన్నింటిని వారసత్వంగా పొందినట్లు వివరించారు.
వివరాలు
రెండు ప్రాంతాల నుంచీ పోటీ..
తన భార్య సంగీత పేరిట కూడా రూ.15 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. తనపై ఎలాంటి అప్పులు లేవని స్పష్టంగా చెప్పారు. స్వయం ఉపాధి, వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం, అలాగే ఆస్తుల నుంచి పొందే అద్దె ఆదాయాలు తన ప్రధాన ఆదాయ వనరులని పేర్కొన్నారు. ఆదాయ వివరాల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.184.53 కోట్ల ఆదాయం పొందినట్లు తెలిపారు. అంతకు ముందు 2023-24లో రూ.105.69 కోట్లు, 2022-23లో రూ.198.71 కోట్లు, 2021-22లో రూ.237.46 కోట్లు, 2020-21లో రూ.8.04 కోట్లు ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఆయన రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. అవి పెరంబూర్, తూర్పు తిరుచ్చి. ఇప్పటికే పెరంబూర్ నియోజకవర్గానికి నామినేషన్ సమర్పించారు.