Loading...
Kumki Elephants: మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు.. పవన్ ఆదేశాలు!
మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు.. పవన్ ఆదేశాలు!

Kumki Elephants: మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు.. పవన్ ఆదేశాలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2026
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

అడవి ఏనుగుల దాడులతో పంటలు దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పార్వతీపురం మన్యం జిల్లా రైతులు, గ్రామస్థులకు త్వరలోనే కొంత ఊరట లభించనుంది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పలమనేరు శిబిరం నుంచి రెండు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను మన్యం జిల్లా గుచ్చిమి శిబిరానికి తరలించేందుకు అటవీశాఖ ఏర్పాట్లు ప్రారంభించింది. రాష్ట్రంలోని నానియాల్ ఏనుగుల శిబిరంలో ప్రత్యేక శిక్షణ పొందిన జయంత్ కుంకీతో పాటు, కర్ణాటక నుంచి తీసుకొచ్చిన అభిమన్యు కుంకీని మన్యం జిల్లాకు పంపనున్నారు. అడవి ఏనుగులను అదుపులోకి తీసుకురావడానికి నిర్వహించిన ఆరు ప్రధాన ఆపరేషన్లలో ఈ రెండు కుంకీలు విజయవంతంగా కీలక పాత్ర పోషించాయి.

వివరాలు 

ఒడిశా నుంచి కూడా కుంకీ ఏనుగులు 

ఇటీవల పలమనేరు సమీపంలో సంచరిస్తున్న ఒంటరి మగ అడవి ఏనుగును బంధించిన ప్రత్యేక ఆపరేషన్‌లో కూడా జయంత్, అభిమన్యు కుంకీలు సమర్థంగా పనిచేసి అటవీశాఖకు సహకరించాయి.

ఇక పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దులకు ఒడిశా రాష్ట్రం నుంచి తరచూ అడవి ఏనుగుల గుంపులు వస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ ఏనుగులు వ్యవసాయ పొలాల్లోకి ప్రవేశించి పంటలను నాశనం చేయడమే కాకుండా,గ్రామాల్లోకి చొరబడి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయి.

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఒడిశా ప్రభుత్వంతో చర్చలు జరిపి,అడవి ఏనుగులను తిరిగి వాటి ప్రాంతాలకు మళ్లించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అలాగే అవసరమైతే ఒడిశా నుంచి కూడా కుంకీ ఏనుగులను తీసుకురావాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు.

వివరాలు 

పార్వతీపురం మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు 

అయితే తక్షణ ఉపశమన చర్యల్లో భాగంగా ఆలస్యం చేయకుండా రాష్ట్రంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న రెండు కుంకీ ఏనుగులను ముందుగా పార్వతీపురం మన్యం జిల్లాకు తరలించాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు.

దీంతో అడవి ఏనుగుల సంచారాన్ని నియంత్రించడం, రైతుల పంటలను రక్షించడం, గ్రామాలపై దాడులను తగ్గించడం వంటి చర్యలకు మరింత బలం చేకూరుతుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.

ADVERTISEMENT