Kolkata Messi Event : కోల్‌కతాలో 'మెస్సి' ఈవెంట్ కేసులో మరో ఇద్దరికి అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
'గోట్ టూర్ ఆఫ్ ఇండియా'లో భాగంగా అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) శనివారం కోల్‌కతాలో పాల్గొన్న కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్టేడియంలో జరిగిన గందరగోళం కేసులో పోలీసులు సోమవారం మరో ఇద్దరిని అరెస్టు చేశారు. స్టేడియంలోని కుర్చీలను ధ్వంసం చేసి, అల్లకల్లోలం సృష్టించిన ఆరోపణలపై శుభోప్రతిమ్, గౌరబ్ బసు అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను మరో 15 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పిస్తామని దర్యాప్తు అధికారులు తెలిపారు.
Details
ఈ ఘటనపై మరింత దర్యాప్తు
ఇదిలా ఉండగా, ఈ కేసు (Kolkata Messi Event case)లో ఇప్పటికే అరెస్టైన ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తాను స్థానిక కోర్టు ఆదివారం 14 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న లియోనెల్ మెస్సి నేడు ఢిల్లీకి చేరుకోనున్నాడు. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (AIFF) మాజీ అధ్యక్షుడు, ఎన్‌సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్ నివాసంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదిలను మెస్సి కలవనున్నట్లు సమాచారం. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ప్రారంభమయ్యే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.