Peddapalli: పెద్దపల్లిలో ఫుడ్ పాయిజన్.. ఇద్దరు మృతి, 17 మందికి అస్వస్థత
పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటలో విషాదం చోటుచేసుకుంది. ఇటుక బట్టీల యూనిట్‌లో కలుషిత ఆహారం తిని ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, 17మంది అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన కూలీలు గౌరెడ్డిపేట్‌లోని ఎంఎస్‌ఆర్ ఇటుక బట్టీ యూనిట్‌లో పని చేస్తూ ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. యూనిట్ అధికారులు వారిని కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు, వారిలో ఇద్దరు చంద్రశేఖర్ బరిహా, లలిత చికిత్స పొందుతూ మరణించారు. నలుగురు కూలీల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 13 మంది కూలీలు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అస్వస్థకు గురైన వారిలో ముగ్గురు పిల్లలు
ఇదిలా ఉంటే, అస్వస్థకు గురైన వారిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని ఏఎంసీ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన గురించి తెలియగానే, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం స్థానికులను విచారించారు. అయితే అస్వస్థతకు గురైన వారి గురించి అక్కడ సూపర్వైజర్ పని చేస్తున్న మల్లేశం పోలీసులకు ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. వారు కోడి పేగులు, కాళ్లు తిన్నారని, ఆ తర్వాత అస్వస్థకు గురయ్యారని వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పూర్తిస్థాయి విచారణ చేపట్టారు.