Page Loader
Helicopter:హెలికాప్టర్ సముద్రంలో అత్యవసరంగా ల్యాండింగ్.. ముగ్గురు సిబ్బంది గల్లంతు 
:హెలికాప్టర్ సముద్రంలో అత్యవసరంగా ల్యాండింగ్.. ముగ్గురు సిబ్బంది గల్లంతు

Helicopter:హెలికాప్టర్ సముద్రంలో అత్యవసరంగా ల్యాండింగ్.. ముగ్గురు సిబ్బంది గల్లంతు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2024
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత తీర గస్తీ దళానికి చెందిన ఒక తేలికపాటి హెలికాప్టర్ అరేబియా సముద్రం మీద అత్యవసర ల్యాండింగ్‌ చేస్తూ ప్రమాదానికి గురైంది. ఈ హెలికాప్టర్‌ అత్యవసర ఆపరేషన్‌ కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కోస్ట్‌ గార్డ్ సిబ్బంది ఒకరిని కాపాడగలిగినా, మిగతా ముగ్గురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. పోర్‌బందర్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోటార్ ట్యాంకర్‌ హరిలీలాలో ఒక సిబ్బంది తీవ్రంగా గాయపడడంతో, ట్యాంకర్‌ మాస్టర్‌ ద్వారా తీర గస్తీ దళానికి సహాయ సందేశం అందింది. గాయపడిన వ్యక్తిని తరలించేందుకు కోస్ట్‌ గార్డ్‌ సోమవారం రాత్రి 11 గంటలకు అధునాతన తేలికపాటి హెలికాప్టర్‌ను పంపించింది.

వివరాలు 

 హెలికాప్టర్‌లో మొత్తం నలుగురు సిబ్బంది 

ప్రయాణ మధ్యలో సమస్య తలెత్తి హెలికాప్టర్ సముద్రంపై అత్యవసర ల్యాండింగ్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, దాంతో అది ప్రమాదానికి గురైంది. ఈ హెలికాప్టర్‌లో మొత్తం నలుగురు సిబ్బంది ఉన్నారు. అప్రమత్తమైన తీర గస్తీ దళాలు వెంటనే సహాయక చర్యలను ప్రారంభించాయి. హెలికాప్టర్‌ శకలాల మధ్య ఒక సిబ్బందిని రక్షించారు, కానీ మిగతా ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం నాలుగు నౌకలు, రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లను సహాయక చర్యల కోసం పంపించామని కోస్ట్‌ గార్డ్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ గతంలో గుజరాత్‌ వర్షాల సమయంలో 67 మందిని సురక్షితంగా రక్షించిందని కూడా వెల్లడించారు.